Reading Time: 2 minutes
Botsa Satyanarayana Comments On Nda Alliance Government Tirupati Meeting

Botsa Satyanarayana : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో కూటమి నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, అది విజయ సభ కాదు, ప్రజలకు చేస్తున్న ‘వెన్నుపోటు సభ’ అని అభివర్ణించారు. ఆ సభలో కేవలం మైకుల సౌండ్ తప్ప జనం నుంచి ఎలాంటి రీసౌండ్, రియాక్షన్ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెబుతున్న ‘సూపర్ సిక్స్’ పథకాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయని, ఆడబిడ్డ నిధి వంటి పథకాలకు మంగళం పాడేందుకే ఈ సభ నిర్వహించారని మండిపడ్డారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే కూటమి పార్టీలు, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క మహిళకు కూడా ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు బేల మాటలు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందనే నಮ್ಮకం తనకు లేదని, రెండేళ్ల కూటమి పాలనకు తాము ‘సున్నా’ మార్కులు వేస్తున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రైతాంగం, విద్యారంగం పూర్తిగా సంక్షోభంలో పడిపోయాయని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతు పండించే ఏ పంటకూ సరైన ధర లేదని, కానీ మార్కెట్లో తినే వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయని, మధ్యలో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న దళారులు మాత్రమే బాగుపడుతున్నారని ఆరోపించారు. ఎరువుల పంపిణీని యాప్ ఆధారితం చేసి చేతులెత్తేయడంతో రైతులు పక్క రాష్ట్రాల నుండి బ్లాక్‌లో కొనుగోలు చేసుకుంటున్నారని, ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఇక విద్యాశాఖను ఛాలెంజ్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్, వ్యవస్థను బాగు చేయడానికి కాకుండా పూర్తిగా చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని వసతులతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సీతాకోకచిలుకల్లా ఉండేవారని, ఇప్పుడు ఆ సౌకర్యాలన్నీ ఏమయ్యాయని నిలదీస్తూ, లోకేష్ డిక్షనరీలో డీఎస్సీ (DSC) కి అసలు అర్థం ఏంటో ఆయనే చెప్పాలన్నారు.

రాష్ట్రంలో సమస్యలను పక్కనపెట్టి ఎకరం రూపాయి చొప్పున భూములను కట్టబెట్టి కిక్‌బ్యాక్స్ తీసుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గూగుల్ డేటా సెంటర్ బండారం కూడా రెండు రోజుల్లో బయటపడుతుందని బొత్స హెచ్చరించారు. అప్పులు చేయడంలో తప్ప ఈ ప్రభుత్వం దేంట్లోనూ గ్రేట్ కాదని, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఐదు పైసలైనా కరెంట్ ఛార్జీలు తగ్గించామని ఏ ఇంటికైనా వెళ్లి నిరూపించగలరా అని సవాల్ విసిరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను కాపాడాల్సింది పోయి వాటిని అమ్ముకోమని చెప్పడం దారుణమన్నారు. బీచ్‌లలో బార్లను ఓపెన్ చేస్తూ సంస్కృతిని పాడుచేస్తుంటే మిక్స్‌డ్ కಲ್చర్ ఉన్న జనసేన అంగీకరించవచ్చు కానీ, ఒకే కల్చర్ అని చెప్పుకునే బీజేపీ ఎలా ఒప్పుకుందో చెప్పాలన్నారు. చంద్రబాబు వెనుక కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు తానా అంటే తానా అంటున్నాయని, ఇప్పటికైనా ప్రజలను వెన్నుపోటు పొడవడం ఆపి, సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.