
Cyber Crime: ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ‘టిండర్’ (Tinder) వేదికగా జరిగిన ఓ ఘరానా మోసంలో హర్యానాకు చెందిన ఒక మహిళా జడ్జి ఏకంగా రూ. 52 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. సీక్రెట్ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నానంటూ పరిచయమైన ఒక వ్యక్తి.. హనీట్రాప్ ద్వారా ఆమెను బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో ఒక ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలైన సదరు జడ్జి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, తన ఇంట్లో పనిచేసే మహిళ (పనిమనిషి) పేరుతో కంప్లైంట్ ఇప్పించారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా తానే మోసపోయానంటూ ఆ పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఢిల్లీ కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిందితుడికి బెయిల్ నిరాకరించిన కోర్టు.. ఫిర్యాదు దాఖలు చేసిన తీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఎఫ్‌ఐఆర్ (FIR) ప్రకారం.. సదరు మహిళా జడ్జికి గత నవంబర్‌లో టిండర్ యాప్‌లో అభిమన్యు వశిష్ఠ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కాలక్రమేణా వీరిద్దరి మధ్య బంధం బలపడింది. ఈ క్రమంలోనే లాభదాయకమైన పెట్టుబడి పథకాలు ఉన్నాయంటూ నమ్మబలికిన నిందితుడు.. ఆమె నుండి విడతల వారీగా రూ. 52 లక్షలకు పైగా తన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నాడు. అయితే, అతను చెప్పినట్లు ఎలాంటి లాభాలు రాకపోగా, అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని సదరు జడ్జి గ్రహించారు.
అయినప్పటికీ, సమాజంలో తమ హోదాకు ఎక్కడ భంగం కలుగుతుందోనన్న సంకోచంతో ఆమె తన పేరుతో కాకుండా, తన పనిమనిషి పేరుతో కేసు పెట్టించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కింది కోర్టు బెయిల్ నిరాకరించడంతో నిందితుడు సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను విచారించిన అడిషనల్ సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ లాలెర్.. అనుమానాస్పద లావాదేవీలన్నీ జడ్జి బ్యాంకు ఖాతాల నుంచే జరిగాయని, పనిమనిషి ఖాతా నుంచి కాదని గుర్తించారు. అసలైన బాధితురాలు ఎవరో ఫిర్యాదులో స్పష్టంగా లేదని, ఒక జడ్జి హోదాలో ఉండి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ను ఇలా పరోక్షంగా ఆశ్రయించడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ‘రోమాన్స్ స్కామ్స్’ లో చిక్కుకున్నప్పుడు బాధితులు ఇబ్బందిగా, అవమానంగా భావించడం సహజమే అయినప్పటికీ.. పారదర్శకమైన, సమగ్రమైన దర్యాప్తు కోసం నిజాలు దాచకూడదని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల వైఫల్యాలను సైతం కోర్టు ఎత్తిచూపింది. వారిద్దరూ మాట్లాడుకున్న టిండర్ చాట్స్ గానీ, పూర్తి స్థాయి వాట్సాప్ సంభాషణలను గానీ పోలీసులు సేకరించలేదు. కనీసం కాల్ డేటా రికార్డులను (CDR) కూడా స్వాధీనం చేసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు నిందితుడు కూడా కోర్టుతో దాగుడు మూతలు ఆడుతున్నాడని, సదరు జడ్జి తనకు పంపిన మెసేజ్‌లను మాత్రమే చూపిస్తూ, తాను పంపిన రిప్లైలను డిలీట్ చేశాడని కోర్టు పేర్కొంది. ఫోన్ పాస్‌వర్డ్ ఇవ్వకుండా దర్యాప్తునకు సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించాల్సి ఉందని చెబుతూ నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వెంటనే వారిద్దరి టిండర్, వాట్సాప్ రికార్డులను సేకరించాలని, వారు ఎక్కడెక్కడ కలుసుకున్నారో విచారించాలని పోలీసులను ఆదేశించింది.