
బరువు తగ్గించుకునేందుకు ఇంజెక్షన్లను వాడుతున్న వారికి యూకే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజెక్షన్ కష్టాలకు స్వస్థి చెబుతూ.. ఇక నుంచి వెయిట్ లాస్ ట్యాబ్లెట్ల వినియోగానికి ఆమోదం తెలిపింది. వెయిట్ లాస్ పిల్.. నోవో నార్డిస్క్ ట్యాబ్లెట్ కు బ్రిటన్ మెడిసిన్ రెగ్యులేటర్ (ఔషధ నియంత్రణ సంస్థ) 2026 జూన్ 11న ఆమోదం తెలిపింది.
ఇప్పటి వరకు అమెరికాలో ఈ పిల్ వినియోగానికి ఆమోదం ఉండగా.. బ్రిటన్ లో ఆమోదం లభించడంతో ఇండియా సహా ప్రపంచ దేశాలలో త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఊబకాయస్తుల ఇంజెక్షన్ కష్టాలు తొలగిపోనున్నాయని మెడికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
బరువు తగ్గించే చికిత్సను మార్చివేసి, ప్రపంచ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని రీబిల్డ్ చేసిన ఈ మందుల వాడకాన్ని విస్తరించడానికి ఔషధ తయారీ సంస్థలు పోటీ పడుతున్న తరుణంలో, ఈ ఆమోదం యూకేలో కోటి మందికి పైగా ప్రజలకు ఉపశమనం కల్పించనుంది. ఈ పిల్ లో సెమాగ్లుటైడ్ అనే క్రియాశీల పదార్ధం ఉంటుంది. దీన్ని నోవో కంపెనీ కి చెందిన వెగోవీ, మధుమేహం కోసం వినియోగించే ఓజెంపిక్ ఇంజెక్షన్ మందులలో కూడా ఉపయోగిస్తారు .
నోవో కంపెనీ బరువు తగ్గించే పిల్ కు మొదట అమెరికాలో ఆమోదం పొందటంతో ఈ ఏడాదే అక్కడ విడుదల చేసింది. నోవో కు అనుమతి రాగానే లిల్లీ కంపెనీ కూడా నోటి ద్వారా తీసుకునే మందు ఫౌండాయోతో వెంటనే ఏప్రిల్ లో అనుమతి పొందింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఊబకాయం మందుల మార్కెట్‌లో ఈ కంపెనీలు పోటీ పడుతున్నందున, ఇంజెక్షన్లు వాడటానికి ఇష్టపడని రోగులను మాత్రలు ఆకర్షించగలవని ఈ రెండు ఔషధ తయారీ సంస్థలు భావిస్తున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ ఆదాయం 100 బిలియన్ డాలర్లను (9 లక్షల 53 వేల కోట్ల రూపాయలు) దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కొంతమందికి, ఇంజెక్షన్ల కంటే నోటి ద్వారా తీసుకునే మందులతో చికిత్స మరింత సులువుగా పనిచేస్తుండవచ్చునని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మేరీ స్ప్రెక్లీ అన్నారు. ఈ టాబ్లెట్‌ను ఖాళీ కడుపుతో, భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలని ఆమె తెలిపారు.