
నమ్మిన స్నేహితుడు మోసం చేశాడు.. తోటి ఉద్యోగులు నరకం చూపించారు.. చివరకు ఆ మానసిక వేధింపులు తట్టుకోలేక పూణే టీసీఎస్ (TCS) లో పనిచేసే ఓ ఐటీ ఇంజనీర్ ప్రాణాలు తీసుకున్నారు. కార్పొరేట్ ఆఫీసుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వాస్తవాలను బయటపెట్టిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…
పూణేలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో తోటి ఉద్యోగుల వేధింపులు తట్టుకోలేక 48 ఏళ్ల ఐటీ ఇంజనీర్ అమిత్ అభయ్ బ్రహ్మే ఆత్మహత్య చేసుకున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి, వేధింపులకు ఈ ఘటన అద్దం పడుతోంది.
రెండు పేజీల సూసైడ్ నోట్: బయటపడ్డ నిజాలు
జూన్ 2న అమిత్ బ్రహ్మే అతని ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అమిత్ గదిలో రెండు పేజీల సూసైడ్ నోట్ దొరికింది. కంపెనీలో అతను అనుభవించిన నరకయాతనను ఆయన సూసైడ్ నోట్ లో వివరంగా రాశారు.
తాను కష్టపడి చేసిన మంచి ప్రాజెక్టులను సీనియర్ ఉద్యోగులైన అర్చన, శశ్వతిలు కావాలనే లాగేసుకున్నారని అమిత్ ఆరోపించారు. సమయానికి పూర్తి చేయడం సాధ్యం కాని అత్యంత కష్టమైన పనులను మాత్రమే తనకు అప్పగిస్తూ మానసికంగా వేధించారని పేర్కొన్నారు.
ఆఫీసులో అందరి ముందూ తనని పదేపదే అవమానించేవారని, ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ నిరంతరం ఒత్తిడి తెచ్చారని అమిత్ సూసైడ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
నమ్మిన స్నేహితుడే మోసం
నా ప్రాణస్నేహితుడిగా భావించిన వినోద్ పాలిచా అనే మరో ఉద్యోగి కూడా తనని మోసం చేశాడని అమిత్ లేఖలో రాశారు. హింజవాడిలోని ఐటీ క్యాంపస్‌లో అందరి ముందు తన పరువు తీయడానికి, తనపై వినోద్ తప్పుడు ఫిర్యాదులు చేశాడని ఆయన ఆరోపించారు.
ముగ్గురిపై కేసు
అమిత్ బ్రహ్మే రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా అర్చన, శశ్వతి, వినోద్ పాలిచాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అన్ని టెక్నికల్, కార్పొరేట్ కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు.
ఐటీ ఉద్యోగుల ఆందోళన.. సీఎంకు విజ్ఞప్తి
ఈ ఘటనపై మహారాష్ట్ర ఐటీ ఉద్యోగుల సంఘం ‘నైట్స్’ (NITES) తీవ్రంగా స్పందించింది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సమస్యలను తెలుసుకోవడానికి, ఆఫీసుల్లో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి సరైన నిబంధనలు ఉన్నాయో లేదో పరిశీలించాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఒక లేఖ రాసింది. కార్పొరేట్ ఆఫీసుల్లో ఇలాంటి వేధింపుల వల్ల ఉద్యోగులు ప్రాణాలు కోల్పోకుండా గట్టి రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఐదు నెలల్లో ఇద్దరు
ఆఫీసులో చాలా కాలంగా జరుగుతున్న మానసిక వేధింపులు భరించలేకే అమిత్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఇదే పూణే హింజవాడి టీసీఎస్ క్యాంపస్‌లో ఈ ఏడాది జనవరిలో సుజల్ వినోద్ ఓస్వాల్ (24) అనే మరో యువ ఉద్యోగి కూడా చనిపోయాడు. ఈ కేసు దర్యాప్తు ఇంకా సాగుతోంది. కొద్ది నెలల గ్యాప్‌లోనే ఒకే కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు చనిపోవడాన్ని మనం సాధారణ విషయంగా వదిలేయలేం” అని నైట్స్ (NITES) ఆందోళన వ్యక్తం చేసింది.