Reading Time: < 1 minute
Oman Coast Incident 14 Indian Crew Rescued After Ship Sinks

Ship sink: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓడ ఇంజన్ వైఫల్యంతో మునిపోవడం ప్రారంభమైంది. సకాలంలో రెస్క్యూ చేయడంతో అందులో ఉన్న 14 మంది భారతీయుల్ని సురక్షితంగా కాపాడారు. అయితే, ఇదే ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో ఒక భారతీయ నావికుడు మరణించారు. జూన్ 14న MSV విరాట్-1 అనే కార్గో షిప్ మునిగిపోయినట్లు మస్కట్‌లోని భారతీయ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రమాదం ఒమన్ లోని రాస్ అల్ హద్‌కు సుమారు 80 నాటికన్ మైళ్ల దూరంలో జరిగింది.

ముందుగా పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఇండియన్ నేవీకి చెందిన నౌకలు సంఘటనా స్థలానికి వెళ్లాయి. అయితే, అమెరికన్ నేవీకి చెందిన పీ-8 సముద్ర నిఘా విమానం సంఘటన స్థలానికి చేరుకుని ఒక లైఫ్ రాఫ్ట్ జారవిడిచి, భారతీయ సిబ్బందిని రక్షించింది. ఓడలోని 14 మంది సిబ్బంది లైఫ్ రాఫ్ట్ సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఎంవి జబల్ అలీ 9 నౌక కూడా సంఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇదిలా ఉంటే మరో నౌకలో భారతీయ పౌరుడు నిశాంత్ ఉర్తానంతన్ మరణించారు. ఆరోగ్య కారణాల వల్ల మరణించినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అతడి మృతదేహం దుక్మ్ పోర్టులోని ఎంటీ సెలెస్టియన్ నౌకలో ఉంది. అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది.