Reading Time: < 1 minute
Iran Closes Isfahan Tunnels Amid Uranium Row Raising Concerns For Us Nuclear Talks

అమెరికా-ఇరాన్ వార్‌కు ఫుల్‌స్టాప్ పడటం లేదు. రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటిస్తున్నాయి, కానీ అధికారంగా ఒప్పందం మాత్రం కాలేదు. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న ‘‘యురేనియం’’పై ప్రతిష్టంభన నెలకొంది. ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం ఉంది, ఇది తమకు ఇవ్వాలని అమెరికా అల్టిమేటం విధిస్తోంది. అయితే, ఈ యురేనియాన్ని ఇవ్వడానికి ఇరాన్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

ఈ యురేనియాన్ని దక్కించుకోవడానికి ఇరాన్‌లో భూతల దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయిల్ వద్ద ప్రణాళికలు ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘‘యురేనియం’’ విషయంలో ఇరాన్ అతిపెద్ద గేమ్ ఆడుతోంది. యురేనియం ఉన్నట్లుగా భావిస్తున్న సొరంగాల ప్రవేశ మార్గాలను ఇరాన్ స్వయంగా మూసేసింది. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ మైన్స్ అమర్చిందని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్స్ వెల్లడించాయి.

ఇస్ఫహాన్ అణు కేంద్రం కింద ఉన్న భూగర్భ సొరంగాల్లోనే యురేనియం నిల్వలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే, ఈ మార్గాలు ధ్వంసమవ్వడం, ప్రవేశాల్లో ల్యాండ్ మైన్స్ పెట్టడం వల్ల అక్కడికి చేరుకోవడం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితి అమెరికా, ఇజ్రాయిల్‌కే కాదు, ఇరాన్‌కు కూడా యురేనియం మళ్లీ తీసుకోవడంలో ప్రమాదంగా మారింది. సొరంగాలు పూర్తిగా సీల్ కావడంతో యురేనియం అందుబాటులో లేని ఇరాన్ వాదించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతికి ఇక ఇరాన్ యురేనియం చిక్కనట్లే అని వారు చెబుతున్నారు.