
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘సింగీతం’. ఆయన ఇంటి పేరు వచ్చేలా పెట్టిన ఈ సినిమా, ప్రేక్షకుల ముందుకు వచ్చి యునానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే, నిజానికి ఈ సినిమా కథ ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలని సింగీతం శ్రీనివాసరావు చేయని ప్రయత్నం లేదు. నిజానికి కమల్ హాసన్ ‘పుష్పక విమానం’ కన్నా ముందే రాసుకున్న ఈ కథను, పలు కారణాలతో అప్పట్లో సినిమా చేయలేకపోయారు.
అయితే, ఈ మధ్యకాలంలో ఈ సినిమా చేయడానికి సింగీతం శ్రీనివాసరావు చాలా ప్రయత్నాలు చేశారట. టాలీవుడ్‌లో కొంతమంది టాప్ నిర్మాతలకు కూడా ఈ సినిమా కథ ఆయన వినిపించినట్లుగా తెలుస్తోంది. అయితే, “ఇలాంటి సినిమా వర్కౌట్ అవుతుందో, అవ్వదో? ఇలాంటి ప్రయోగాలు మనకెందుకు, ఎందుకు వచ్చిన రిస్క్?” అనుకున్న కొంతమంది నిర్మాతలు.. ‘చేద్దాం’ అంటూ కాలయాపన చేస్తూ వచ్చారట.
నేరుగా ‘నో’ చెప్పకుండానే, అలాగని ‘ఇప్పటికిప్పుడు పట్టాలెక్కిద్దామా?’ అంటే ‘ఆగాలంటూ’ ఆయన టైం వేస్ట్ చేస్తూ రావడంతో.. ఈ విషయాన్ని ఒకానొక సందర్భంలో నాగ్ అశ్విన్ దృష్టికి తీసుకువెళ్లారట సింగీతం.
అయితే, ఐడియా విని ఎక్సయిట్ అయిన వెంటనే, సినిమాని తానే నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో నాగ్ అశ్విన్ నిర్మాతగా, వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సమర్పణలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా యునానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే.. చాలామంది నిర్మాతల జడ్జిమెంట్ తప్పని అటు సింగీతం శ్రీనివాసరావుతో పాటు, ఇటు నాగ్ అశ్విన్ కూడా నిరూపించారు. ఇది ఒక రకంగా అలాంటి నిర్మాతలకు ఒక కనువిప్పునే చెప్పాలి.