Reading Time: 2 minutes

ఆధ్యాత్మికం: గొప్పవారంటే ఎవరు.. వారిని ఎందుకు పొగడాలి..ఎవరిని ఆదర్శంగా తీసుకొని జీవించాలి..

Caption of Image.

ఏమని పొగదుడుమే యిక నిను
ఆమని సొబగుల అలమేల్మంగ అన్నాడు అన్నమయ్య.
ఇంకా.. ‘‘ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి..’’
 

అంటూ భగవంతుని శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రశంసించాడు. సోమకాసురుడు ఎత్తుకుపోయిన వేదాలను వెతికి తీసుకొచ్చింది ఆ చేయి. క్షీర సాగర మథనం వేళ మందరగిరి కుంగిపోకుండా తాబేలు రూపంలో కాపాడింది ఆ చేయి.  భూమిని ఎత్తుకుపోతున్న హిరణ్యాక్షుడు చేతి నుంచి భూమిని కాపాడింది ఆ చేయి.. ఇలా ఎన్నో మంచి పనులను చేసిన చేతిని పొగిడాడు అన్నమయ్య.

అసలు ఎవరినైనా ఎందుకు పొగడాలి? అని ప్రశ్నిస్తే.. దానికి సమాధానం ‘‘ఎవరిని పొగిడితే ఇతరులకు ఆదర్శంగా ఉంటారో అలాంటివాళ్లని.. ఏ పనిని పొగిడితే ఆ పనిని ఇతరులు ఆచరించాలో అలాంటి పనులను’’ పొగడాలని భగవద్గీత చెప్తోంది. 

ఇంద్రుడు అసుర సంహారం చేయాల్సి వచ్చింది. అందుకు దధీచి మహర్షి వెన్నెముకతో తయారయ్యే ఆయుధం కావాల్సి వచ్చింది. దధీచి తపస్సు చేసి, తన దేహాన్ని క్షీణింపజేసి, ఎముకలను సమర్పించాడు. ఆ ఎముకలతో వజ్రాయుధాన్ని తయారుచేసి దేవేంద్రుడు అసుర సంహారం చేశాడు. అంటే అక్కడ అధర్మాన్ని నాశనం చేయడం కోసం తన దేహాన్ని సమర్పించాడు. 

అటువంటివారిని ప్రశంసిచండం వల్ల అధర్మాన్ని నశింపచేయడానికి మరికొందరు ముందుకొస్తారు. సత్యం పలికిన హరిశ్చంద్రుడు, తన శరీరంలోని మాంసాన్ని ఖండించి ఇచ్చిన శిబి చక్రవర్తి.. ఇటువంటివారిని నిత్యం పొగుడుతూనే ఉండాలి. అప్పుడే మనం వారిని అనుసరించడానికి అవకాశం ఉంటుంది.

చరిత్రలోకి వెళ్తే.. 

గుప్తులను, శాతవాహనులను, శ్రీకృష్ణదేవరాయలను పొగిడి తీరాలి. తెలుగు నేలను సుమారు నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించారు శాతవాహనులు. వారి కాలంలో తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో కళలను ఆస్వాదిస్తూ, సాహిత్య గోష్ఠులలో పాల్గొన్నారు. అటువంటి రాజును పొగడం వల్ల ప్రస్తుత పరిపాలకులకు ఆదర్శంగా ఉంటారు.

 గుప్తుల కాలం స్వర్ణయుగం అని చదువుకున్నాం. ఆ కాలంలో నవరత్నాల పేరిట సాహిత్యపోషణ జరిగింది. వారి పరిపాలనలో ప్రజలంతా సిరిసంపదలతో తులతూగారు. ప్రజలంతా ప్రభువుల పట్ల విధేయులుగా ఉన్నారు. అందువల్ల గుప్తులను పొగిడి తీరాలి. 

ఇక శ్రీకృష్ణదేవరాయలు.. ఆంధ్రభోజుడుగా ప్రశంసలు అందుకున్నాడు. ఆయన కవి కావటంతోపాటు తన ఆస్థానంలో అష్టదిగ్గజాలు పేరున ఎనిమిది మంది కవులతో భువన విజయ సభను ఏర్పాటు చేశాడు. మంత్రి తిమ్మరుసు (అప్పాజీ) వంటి సమర్థుల సహకారంతో రాజ్యాన్ని విజయవంతంగా పాలించాడు. అందువల్ల శ్రీకృష్ణదేవరాయలను ప్రశంసించాలి. 

ఇలా ఈ రాజులందరూ సంగీత, సాహిత్యాలను మాత్రమే కాకుండా అన్ని కళలను పోషించారు. వారు చేసిన మంచి పనులను మరచిపోకుండా మరిన్ని మంచి పనులు చేయాలనే విషయాన్ని గుర్తుచేసేందుకు కొందరు వందిమాగధుల వంటి వారు నిత్యం రాజును పొగుడుతూ ఉండేవారు. 

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. భారత తొలి ప్రధానిగా  జవహర్‌లాల్‌ నెహ్రూ భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. ఆ తరువాత పి.వి. నరసింహారావు.. సంక్షోభంలో ఉన్న భారతదేశ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారు. అందువల్ల వీరిని గౌరవించాలి. 

ఎవరి వల్ల మేలు జరిగి మరింతమందికి ఆదర్శప్రాయంగా నిలబడతారో అటువంటి వారిని మాత్రమే పొగడాలనే విషయాన్ని మరచిపోకూడదు. సీతారాముల, పార్వతీపరమేశ్వరుల ఆదర్శ దాంపత్యాన్ని పొగడాలి. రామలక్ష్మణుల సోదరప్రేమను కూడా పొగడాలి. అన్న కష్టసుఖాలను సమానంగా పంచుకున్న లక్ష్మణుడు సోదర ప్రేమకు ఆదర్శనీయుడు. అందుకే ఒక సందర్భంలో రాముడు.. 

దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవా
తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః 

ఏ దేశానికి వెళ్లినా భార్య దొరుకుతుంది. ఏ దేశంలోనైనా బంధువులు దొరుకుతారు. కానీ తోడబుట్టిన సొంత సోదరుడు మాత్రం ఎక్కడ వెతికినా దొరకడు.. అంటాడు. అంత ప్రేమను కురిపించిన రాముడిని ప్రశంసించాలి. అన్నదమ్ముల ఆప్యాయతకి వీళ్లు ఆదర్శప్రాయంగా నిలబడతారు.

– డా. పురాణపండ వైజయంతి-

మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.

 

©️ VIL Media Pvt Ltd.