
హైదరాబాద్ వాసులకు భారీ గుడ్ న్యూస్. నగరంలో ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ అనేక ఫ్లైఓవర్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భారీ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతోంది. ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్స్ సిగ్నల్స్ వద్ద ఆగే పని ఉండదు. వేగవంతంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. దీంతో సిగ్నల్స్ లేని ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణాన్ని అందించేందుకు జీహెచ్‌ఎంసీ వంతెనలను నగరంలో నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందడుగు వేసింది. ఈ సారి నగరం నడిబొడ్డున రాష్ట్ర అసెంబ్లీ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి కసరత్తులు చేస్తోంది.
ట్రాఫిక్ రద్దీకి చెక్
అసెంబ్లీ సమావేశాలు, వీఐపీల రాకపోకల సమయంలో అసెంబ్లీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంతేకాకుండా నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలతో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూసేందుకు అసెంబ్లీ వద్ద వంతెన నిర్మాణానికి హెచ్‌ఎండీఎ సిద్దమైంది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అసెంబ్లీ వెనుక భాగంలో 1.5 కిలోమీటర్ల మేర “వై” ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేయనుంది. నాంపల్లి నుంచి లక్డీకాపూల్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాల కోసం వన్ వేగా దీనిని నిర్మించనున్నారు. పబ్లిక్ గార్డెన్ నుంచి అసెంబ్లీ వెనుక వైపుగా లక్డీకాపూల్ వరకు ఫ్లైఓవర్ ఉంటుంది. లక్డీపాపూల్ దాటిన తర్వాత మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్ వైపు విడిపోయేలా “వై” ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మించాలని హెచ్‌ఎండీఏ ప్లాన్‌కు రూపకల్పన చేసింది.
భూసేకరణ పూర్తి
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. 99 శాతం వరకు ప్రభుత్వ ఆస్తులను హెచ్‌ఎండీఏ కేటాయించింది. ప్రైవేట్ ఆస్తుల అవసరం లేకుండా అలైన్ మెంట్ ఖరారు చేశారు. ఇప్పటికే రూట్ మ్యాప్, అలైన్ మెంట్ రూపొందించారు. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ముందు భాగం నుంచి ఫ్లైఓవర్ ప్రారంభం అవుతుంది. పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ వెనుక భాగం, రైల్వే లైన్ మీదుగా లక్డీకాపూల్ జంక్షన్ వద్దకు చేరుకుంటుంది. జంక్షన్ వద్ద రెండుగా చీలుతుంది. మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లేలా ఒక మార్గం, ఖైరతాబాద్ వైపు వెళ్లేలా మరో మార్గం ఉంటుంది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కంటే ముందే లక్డీకాపూల్ మెయిన్ రెడ్డుపై ఫ్లైఓవర్ ల్యాండ్ అయ్యేలా డిజైన్‌కు రూపకల్పన చేశారు. ఈ ఫ్లైఓవర్ వల్ల నాంపల్లి నుంచి వచ్చేవారు ట్రాఫిక్ రద్దీ లేకుండా మసాబ్ ట్యాంక్, ఖైరతాబాద్ వైపు వెళ్లవచ్చు.