
CM Revanth Reddy: కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అత్యంత బాధాకరమైన విషయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఈ అంశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ వ్యవహారంలో మీనాక్షి నటరాజన్‌కు సంబంధించి ఎలాంటి కేసు లేదని, మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి తప్పుగా వ్యవహరించారని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా రిటర్నింగ్ అధికారి పనిచేశారని, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టడం వెనుక కూడా కుట్ర ఉందని రేవంత్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో నితిన్ నబీన్, ఎన్నికల అధికారుల పాత్రపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. గాంధేయవాది అయిన మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభకు రాకుండా అడ్డుకోవడమే ఈ చర్యల వెనుక ఉద్దేశమని విమర్శించారు.
“ఇన్నాళ్లు బీజేపీ ఓట్ల చోరీ చేస్తుందని అనుకున్నాం.. ఇప్పుడు సీట్ల చోరీ కూడా చేస్తోంది” అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేదని, కేవలం ఒక ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా కోర్టు నోటీసులు జారీ కావడం సాధారణ ప్రక్రియ మాత్రమేనని చెప్పారు. ఆ ఫిర్యాదులో ఉన్న వ్యక్తిగత వివాదాలకు మీనాక్షి నటరాజన్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని ఆరోపించిన రేవంత్, గతంలో బీజేపీ గాడ్సే సిద్ధాంతాలను అనుసరిస్తోందని భావించామని, ఇప్పుడు ఉత్తర కొరియా తరహా రాజకీయాలను అనుసరిస్తోందనే భావన కలుగుతోందని విమర్శించారు.
కిషన్ రెడ్డిపై మరోసారి విమర్శలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము కేంద్రాన్ని కోరుతున్న సమయంలో, వాటిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సమస్యలపై కనీసం ఒక్క లేఖ అయినా కిషన్ రెడ్డి రాశారా అని ప్రశ్నించారు. కేంద్రంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR), హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలు, ఇతర కీలక ప్రాజెక్టులు ఎందుకు ముందుకు సాగడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మల్కాజ్‌గిరి వరకు మెట్రో విస్తరణ విషయంలో కూడా రాజకీయ కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం చొరవ చూపాలి
పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌కు ఏడు మండలాలను బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రాజెక్టుల కోసం అవసరమైన 1,500 ఎకరాల భూమి అంశాన్ని ఎందుకు పరిష్కరించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఉన్న ఈ అంశంపై కేంద్రం ముందుండి చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం అవసరమైన ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురావాలని, అందుకు కిషన్ రెడ్డి కృషి చేయాలని సూచించారు. అవసరమైతే తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.