Reading Time: < 1 minute

చేతికి గాయమైందని ఆస్పత్రికి వస్తే..వైద్యుల నిర్లక్షానికి మహిళ బలి.?అల్వాల్ లో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత

Caption of Image.

సికింద్రాబాద్ అల్వాల్‌లో తీవ్ర విషాదం.. వైద్యుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సెల్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ప్రభావతి అనే మహిళ మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు భారీ ఆందోళనకు దిగారు.

అల్వాల్ సిటిజన్ కాలనీకి చెందిన ప్రభావతి.. చేతి వేలికి చిన్న గాయమై గడ్డ కట్టడంతో చికిత్స నిమిత్తం ఎక్సెల్ ఆసుపత్రికి వచ్చారు. వేలికి ఉన్న కణితికి సర్జరీ చేయించుకునేందుకు ఆమె ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆసుపత్రిలో చేరిన వెంటనే ఆమెకు బీపీ ఎక్కువైందంటూ వైద్యులు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ చేసిన కాసేపటికే ప్రభావతి హఠాత్తుగా బ్రెయిన్ డెడ్ అయి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ALSO READ : హరీష్ రావుకు మంత్రి పొన్నం ఓపెన్ ఛాలెంజ్

చిన్న సర్జరీ కోసం వస్తే.. ప్రాణాలు తీస్తారా అంటూ బాధితులు ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌పై విరుచుకుపడ్డారు. బాధ్యులైన వైద్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. బంధువులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎక్సెల్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన అల్వాల్ పోలీసులు ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న సమస్యతో వచ్చిన మహిళ వైద్యుల నిర్లక్ష్యానికి బలవ్వడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.