
మనం సాంకేతిక యుగపు శిఖరాగ్రాన ఉన్నాం. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, 5జి నెట్‌వర్క్‌లు మానవ జీవితాన్ని అరచేతిలోకి తెచ్చాయి. స్మార్ట్‌ఫోన్‌లో మనం చేసే ప్రతి క్లిక్, చూసే ప్రతి వీడియో, పంపే ప్రతి సందేశం వెనుక ఒక అపారమైన డిజిటల్ మౌలిక వ్యవస్థ పనిచేస్తోంది. ఈ డిజిటల్ ప్రపంచానికి గుండెకాయల వంటివే డేటా సెంటర్లు. నేడు హైదరాబాద్, విశాఖపట్నం దేశంలో ప్రధాన డేటా సెంటర్ హబ్‌లుగా ఎదగడానికి పోటీపడుతున్నాయి. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ వంటి అంశాలు ఈ ప్రాజెక్టులకు అనుకూల వాదనలుగా నిలుస్తున్నాయి.
అయితే ఈ మెరుపుల వెనుక మరో వాస్తవం కూడా ఉంది. డేటా సెంటర్ల విస్తరణతోపాటు నీటి వినియోగం, విద్యుత్ డిమాండ్, భూగర్భ జలాలపై ఒత్తిడి, కార్బన్ ఉద్గారాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఇ- వేస్ట్) పెరుగుదల వంటి పర్యావరణ, సామాజిక సమస్యలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ అభివృద్ధి గురించి పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ, దానికి చెల్లించాల్సిన పర్యావరణ మూల్యం గురించి మాత్రం తగిన చర్చ జరగడం లేదు.భారీ డేటా సెంటర్ ప్రాజెక్టుల విషయంలో పర్యావరణ అనుమతుల ప్రక్రియపై శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సాధారణంగా భారీ ప్రాజెక్టులకు పర్యావరణ ప్రభావ అంచనాలు, ప్రజాభిప్రాయ సేకరణలు, స్థానిక సమాజాలతో సంప్రదింపులు జరగాలి.
కానీ కొన్ని ప్రాజెక్టులను ‘ఐటీ మౌలిక సదుపాయాలు’ లేదా ‘భవన నిర్మాణం’ కేటగిరీల కింద చూపడం ద్వారా కఠినమైన పర్యావరణ పరిశీలనను తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజలకు ప్రాజెక్టుల నీటి అవసరాలు, విద్యుత్ వినియోగం, వ్యర్థాల నిర్వహణ విధానాలు, పర్యావరణ ప్రభావాల గురించి పూర్తి సమాచారం అందకుండా అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధం. అవి ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్నప్పుడు, ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు మాత్రమే కాదు, అభిప్రాయం చెప్పే హక్కు కూడా ఉండాలి.
విస్తృతమైన కూలింగ్ వ్యవస్థలు అవసరం
డేటా సెంటర్లు కేవలం కంప్యూటర్ల గదులు కావు. అవి రోజుకు 24 గంటలు, సంవత్సరంలో 365 రోజులు నిరంతరం పనిచేసే భారీ మౌలిక సదుపాయాలు. వేలాది సర్వర్లు పనిచేసే సమయంలో ఉత్పత్తి అయ్యే వేడిని నియంత్రించడానికి విస్తృతమైన కూలింగ్ వ్యవస్థలు అవసరం అవుతాయి. దీనివల్ల రోజుకు లక్షల లీటర్ల నీరు వినియోగిస్తారు. భూగర్భ జలాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి వినియోగం భవిష్యత్తులో నీటి లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాగునీరు, వ్యవసాయం, స్థానిక అవసరాలు, పారిశ్రామిక అవసరాల మధ్య సమతుల్యత ఎలా సాధించాలనే ప్రశ్నను ఇది ముందుకు తెస్తోంది. డేటా సెంటర్ల చర్చలో నీటి వినియోగం ఎంత ముఖ్యమో, విద్యుత్ వినియోగం కూడా అంతే కీలకమైన అంశం. ముఖ్యంగా ఏఐ ఆధారిత డేటా సెంటర్లు అపారమైన విద్యుత్తును వినియోగిస్తాయి. ఒక పెద్ద డేటా సెంటర్ ప్రాంగణం చిన్న పట్టణం వినియోగించేంత విద్యుత్తును అవసరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. డేటా సెంటర్ల యజమానులు పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తున్నామని చెబుతున్నప్పటికీ గ్రిడ్‌పై ఒత్తిడి వల్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి అవసరం.
- భూమి, నీరు, గాలి కలుషితమయ్యే ప్రమాదం
డేటా సెంటర్లలో ఉపయోగించే సర్వర్లు, స్టోరేజ్ పరికరాలు, మదర్‌బోర్డులు, నెట్‌వర్క్ స్విచ్‌లు, కూలింగ్ పరికరాలు, విద్యుత్ నిల్వ కోసం ఉపయోగించే భారీ బ్యాటరీ వ్యవస్థల సగటు జీవితకాలం 3 నుంచి 5 సంవత్సరాల మధ్యే ఉంటుంది. ఫలితంగా ప్రతి కొన్ని సంవత్సరాలకు భారీస్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇ వేస్ట్‌లో సీసం, కాడ్మియం, బెరిలియం వంటి ప్రమాదకర పదార్థాలు ఉంటాయి. వీటిని శాస్త్రీయంగా నిర్వహించకపోతే భూమి, నీరు, గాలి కలుషితమయ్యే ప్రమాదం ఉంది.
భూమిలో పాతిపెట్టినప్పుడు ఈ రసాయనాలు భూగర్భ జలాల్లో కలిసే అవకాశం ఉంది. బహిరంగంగా కాల్చినప్పుడు విషవాయువులు విడుదలై మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పాత కంప్యూటర్లు, సర్క్యూట్ బోర్డులు, బ్యాటరీలు, కేబుళ్లను విడదీసి విలువైన లోహాలను వెలికితీసే పనిలో వేలాది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో చాలామందికి భద్రతా పరికరాలు, ఆరోగ్య రక్షణ వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండవు. అందువల్ల ఇ -వేస్ట్ సమస్య కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు. అది శ్రామికుల ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంది.
- డేటా సెంటర్ల ప్రభావాలను పర్యవేక్షించాలి
పర్యావరణ పరిరక్షణను కార్పొరేట్ సంస్థల స్వచ్ఛంద బాధ్యతకు వదిలేస్తే సరిపోదు. ఎందుకంటే వాటి ప్రధాన లక్ష్యం లాభాల గరిష్టీకరణ. అందువల్ల డేటా సెంటర్ల పర్యావరణ ప్రభావాలను పర్యవేక్షించడానికి స్వతంత్ర వ్యవస్థలు అవసరం. పర్యావరణ ప్రభావ అంచనాలను కంపెనీలు నియమించుకున్న కన్సల్టెన్సీల చేత కాకుండా, విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు, ప్రజారోగ్య నిపుణులు, స్థానిక ప్రతినిధులు, పౌరసంఘాల ప్రతినిధులతో కూడిన బహుళ సభ్య కమిటీల ద్వారా నిర్వహించాలి. నీరు, విద్యుత్ వినియోగం, ఇ- వేస్ట్ ఉత్పత్తి, రీసైక్లింగ్ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇ- వేస్ట్ నిర్వహణలో పనిచేసే కార్మికులకు భద్రతా ప్రమాణాలు, ఆరోగ్యరక్షణ, శ్రామిక హక్కులకు హామీ ఇవ్వాలి.
- అప్రమత్తంగా వ్యవహరించాలి
పర్యావరణ అనుమతులు ఇవ్వడం, నీటి వినియోగాన్ని పర్యవేక్షించడం, ఇ-వేస్ట్ నిర్వహణను తనిఖీ చేయడం, కాలుష్య నియంత్రణ ప్రమాణాల అమలును నిర్ధారించడం వంటి బాధ్యతలను సంబంధిత శాఖలు నిజాయితీగా నిర్వర్తించాలి. అవినీతి, రాజకీయ లేదా కార్పొరేట్ ప్రభావాలకు ఆస్కారం లేకుండా పారదర్శకమైన పర్యవేక్షణ వ్యవస్థలు ఉండాలి. డేటా సెంటర్ల వల్ల ఉత్పత్తి అవుతున్న భారీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, విద్యుత్, నీటి వినియోగం నియంత్రణ లేకుండా పెరిగితే అది భవిష్యత్తులో తీవ్రమైన పర్యావరణ విధ్వంసానికి దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల అభివృద్ధి పేరుతో సహజ వనరుల వృథా, పర్యావరణ నష్టం జరగకుండా ప్రభుత్వం, పర్యావరణ శాఖలు, ప్రజాస్వామ్య పర్యవేక్షణ సంస్థలు అప్రమత్తంగా వ్యవహరించాలి.
– పాపని నాగరాజు
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.