Reading Time: 2 minutes
Healthy Protein Laddu Recipe Kids Memory Power Anemia

Healthy Protein Laddu: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పౌష్టికాహారం ఎంతో అవసరం. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల్లో జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంపొందించడానికి, రక్తహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఒక అద్భుతమైన పౌష్టిక ఆహారం ‘ప్రోటీన్ లడ్డు’. కేవలం 10 నుంచి 15 రోజుల పాటు రోజుకు ఒక లడ్డు చొప్పున తీసుకోవడం ద్వారా శరీరంలో స్పష్టమైన మార్పును గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏ వయసు వారైనా తీసుకోదగ్గ ఈ హెల్దీ లడ్డును మీ ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలోతెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

బాదం పప్పు – 1 కప్పు

తెల్ల నువ్వులు (లేదా నల్ల నువ్వులు) – 1 కప్పు

బెల్లం తురుము – 1/2 కప్పు (తీపి తక్కువ కావాలనుకుంటే 1/4 కప్పు)

యాలకులు – 4 నుంచి 5

నెయ్యి – 1 నుంచి 2 టీస్పూన్లు (ఆప్షనల్)

తయారీ విధానం ఇదే..

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని, ఒక కప్పు బాదం పప్పును వేయాలి. ఎటువంటి నెయ్యి లేదా ఆయిల్ లేకుండా మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పాటు వాటిని దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఒక కప్పు నువ్వులను వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేయాలి. నువ్వులు కొద్దిగా చిటపటలాడేంత వరకు మాత్రమే వేయించాలి (ఎక్కువ వేపితే చేదు వస్తుంది), వేగిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టి పూర్తిగా చల్లార్చాలి. పూర్తిగా చల్లారిన బాదం, నువ్వులను ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని, అందులోనే 4-5 యాలకులు వేసి మిక్సీని ఒకేసారి తిప్పకుండా, మధ్య మధ్యలో ఆపుతూ (పల్స్ ఇస్తూ) పొడిపొడిగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పొడిలోకి అరకప్పు బెల్లం తురుమును వేసి, ముందుగా చేత్తో బాగా కలిపి, ఆ తర్వాత మళ్లీ మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమం లడ్డు చుట్టడానికి వీలుగా ముద్దలా వచ్చే వరకు గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని, మంచి ఫ్లేవర్ కోసం ఒకటి లేదా రెండు చెంచాల వేడి చేసిన నెయ్యిని, అలాగే సన్నగా తరిగిన కొన్ని బాదం పప్పు ముక్కలను కలపాలి. అంతా బాగా కలుపుకుని చిన్న చిన్న లడ్డులు చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ప్రోటీన్ లడ్డులు రెడీ అయిపోతాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు, ఎదిగే పిల్లలకు, వృద్ధులకు ఈ లడ్డులు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే ఈ లడ్డులను ఇంట్లోనే తయారు చేసుకుని కుటుంబ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు:

బాదం పప్పులో విటమిన్ ‘ఇ’ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి గుండె ఆరోగ్యానికి, కంటిచూపుకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడిని (స్ట్రెస్) తగ్గించి, క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. ముఖ్యంగా ఇందులోని కెరటిన్, రెబోప్లేవిన్ వంటి పోషకాలు బ్రెయిన్ డెవలప్మెంట్‌కి తోడ్పడి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఈ లడ్డులో వాడే నువ్వులు, బెల్లంలో ఐరన్ (ఇనుము) కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజూ ఈ లడ్డును తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలకు ఇది ఒక మంచి సంజీవనిలా పనిచేస్తుందని చెబుతున్నారు.

నువ్వులలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను, పళ్లను ఉక్కులా దృఢంగా మార్చడానికి సహాయపడతాయి. పెరుగుతున్న పిల్లలతో పాటు, కీళ్ల నొప్పులతో బాధపడే వృద్ధులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. చక్కెర, నూనె లేకుండా కేవలం సహజసిద్ధమైన బెల్లం, డ్రై ఫ్రూట్స్ వాడటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. పిల్లల్లో తరచూ వచ్చే అలసట, నీరసాన్ని తగ్గించి రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది, అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని చెబుతున్నారు.