
రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్‌లో ఒక అరుదైన, చారిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నారు. ధర్మశాలలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగడం ఖాయమని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పష్టం చేశారు. రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారని, తొలి వన్డేలో జట్టును ముందుండి నడిపిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 6 పరుగులు చేయగలిగితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా 16,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తారు. ఇంతకుముందు భారతదేశం తరపున ఈ ఘనత సాధించిన ఏకైక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే. సెహ్వాగ్ ఓపెనర్‌గా మొత్తం 16,119 పరుగులు చేశారు. ప్రస్తుతానికి రోహిత్ శర్మ ఖాతాలో ఓపెనర్‌గా 15,994 పరుగులు ఉన్నాయి.
మరో విశేషం ఏమిటంటే.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ గనుక 126 పరుగులు చేయగలిగితే, సెహ్వాగ్ రికార్డును అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా అవతరిస్తారు. ఒకవేళ మొదటి వన్డేలో ఈ మైలురాయిని అందుకోలేకపోయినా, ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల్లో సెహ్వాగ్ ‘మహా రికార్డు’ను బద్దలు కొట్టే అవకాశం హిట్మ్యాన్‌కు పుష్కలంగా ఉంది.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య 19,298 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత క్రిస్ గేల్ 18,867 పరుగులతో రెండో స్థానంలో, డేవిడ్ వార్నర్ 18,744 పరుగులతో మూడో స్థానంలో, గ్రేమ్ స్మిత్ 16,950 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు. వెస్టిండీస్ దిగ్గజం డెస్మండ్ హేన్స్ 16,120 పరుగులతో ఐదో స్థానంలో, వీరేంద్ర సెహ్వాగ్ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ మరో 6 పరుగులు చేస్తే ఈ దిగ్గజాల క్లబ్‌లో చేరడమే కాకుండా, రాబోయే రోజుల్లో వారి రికార్డులను కూడా అధిగమించే దిశగా దూసుకుపోతున్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ లేని లోటు కనిపిస్తున్నప్పటికీ, రోహిత్ శర్మ పునరాగమనం మరియు ఈ రికార్డుల వేట అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.