Reading Time: 2 minutes
Ys Jagan Demands Cbi Probe Into Ap Dsc Recruitment Alleges Mega Scam

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డీఎస్సీగా ప్రచారం చేసిన నియామక ప్రక్రియ వాస్తవానికి “మెగా స్కామ్”గా మారిందని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై స్వతంత్ర సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించిన జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుట్ర కారణంగా లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు దెబ్బతిన్నదని విమర్శించారు. 16 వేల టీచర్ పోస్టుల భర్తీలో పారదర్శకత పూర్తిగా దెబ్బతిందని, నియామక ప్రక్రియపై అనేక అనుమానాలు నెలకొన్నాయని పేర్కొన్నారు.

భద్రతా వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపణ

డీఎస్సీ ప్రక్రియలో ప్రభుత్వ సంస్థాగత భద్రతా వ్యవస్థలను కావాలనే నిర్వీర్యం చేశారని జగన్ ఆరోపించారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అలాగే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గోప్యమైన బాధ్యతలు అప్పగించడం కూడా ప్రశ్నలు రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియలో భాగమైన ఒక ఉద్యోగి ఫస్ట్ ర్యాంక్ సాధించడం పేపర్ లీక్‌కు నిదర్శనమని ఆరోపించారు.

మెరిట్ లిస్ట్, ఫలితాలపై అనుమానాలు

డీఎస్సీ మెరిట్ లిస్టులో మార్పులు జరిగాయని, కొంతమంది అభ్యర్థుల పేర్లు తొలగించబడినట్లు ఆరోపణలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. ఫలితాల ప్రకటనలో పూర్తి పారదర్శకత పాటించలేదని విమర్శించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కూడా కొందరు అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితాలో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. మరోవైపు.. స్పోర్ట్స్ కోటా విధానాన్ని నియామకాల కోసం మార్చి, తర్వాత మళ్లీ పాత విధానానికే తీసుకురావడం వెనుక అనేక ప్రశ్నలు ఉన్నాయని జగన్ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో బ్యాక్‌డోర్ ఎంట్రీలకు అవకాశం కల్పించారని విమర్శించారు.

డబ్బుల బేరసారాల ఆరోపణలు

టీచర్ పోస్టుల నియామకాల కోసం డబ్బుల బేరసారాలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని జగన్ అన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు నామమాత్రపు కేసులతో సరిపెట్టారని ఆరోపించారు.

సీబీఐ దర్యాప్తే మార్గం

డీఎస్సీ నియామకాల వ్యవహారం భారీ అవినీతి కుంభకోణంగా మారిందని జగన్ ఆరోపించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర సీబీఐ దర్యాప్తు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శిస్తూ, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..