
హైదరాబాద్: భారత సివిల్ సర్వీసుల 2025 తుది ఫలితాలు వెలువడిన సందర్భంగా విజయం సాధించిన తెలంగాణ అభ్యర్థులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణతో చేసిన కృషి, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగిన మీ ప్రయాణం ఈ గొప్ప విజయానికి కారణమైందన్నారు. ప్రజా ప్రభుత్వం సింగరేణి సంస్థతో కలిసి అమలు చేస్తున్న ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ పథకం ద్వారా ప్రోత్సాహం పొందిన తెలంగాణకు చెందిన 20 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసుల తుది జాబితాలో స్థానం సంపాదించడం ప్రత్యేకంగా అభినందనీయమని, ఇది ప్రతిభను ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలకు నిదర్శనమని పొన్నం తెలియజేశారు.
సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన యువత కూడా ఉన్నత లక్ష్యాలు సాధించేలా విద్య, మార్గదర్శకత్వం, అవకాశాలు కల్పించడమే మన ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా మరింత మంది యువత సివిల్ సర్వీసుల వంటి ఉన్నత సేవల వైపు ముందుకు రావాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఈసారి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులు ప్రజాసేవను ధ్యేయంగా చేసుకుని దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ అభివృద్ధి, పునర్ నిర్మాణానికి కూడా తమ సహకారం అందించాలని కోరుకుంటున్నానన్నారు.