Reading Time: < 1 minute
Only Electric Vehicle Registrations In India Post 2029 Kishan Reddy

2029 తర్వాత దేశంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్‌లో కీటో మోటార్స్ ఈవీ బస్సును తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టే లక్ష్యంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈవీల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు 40 దేశాల నుంచి జరిగే పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం 73 శాతం విద్యుత్ బొగ్గు ఆధారితమేనని, భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఏపీలో అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్, రూ. లక్ష కోట్లతో సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు చేపడతామని, చైనాపై ఆధారాన్ని తగ్గించుకోవడానికి రూ. 3,600 కోట్లతో క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు.

అదే కార్యక్రమంలో TGSRTC ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆర్టీసీ 1,050 ఈ-బస్సులు నడుపుతోందని, ‘పీఎం ఈ-డ్రైవ్’ కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పెట్రోల్, డీజిల్ వాహనాలు భారీగా తగ్గుతాయని, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోందని వివరించారు.