
- ప్రభుత్వంలో ఉన్నోళ్లే విద్వేష ప్రసంగాలు చేస్తున్నరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: దేశ తలరాతను నిర్ణయించేది జెన్ జీ యువతేనని.. 2029 ఎన్నికల నాటికి దేశంలో సగానికిపైగా ఓటర్లు వారేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ పత్రిక వార్షికోత్సవ సెమినార్‌లో మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీడియా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమను తాము మార్చుకోవాలన్నారు. దేశంలో పత్రికా స్వేచ్ఛ హరించుకుపోతున్నదని.. నిజాలు చెప్పే వారిని జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు.
మీడియా మేనేజ్‌మెంట్, హెడ్‌లైన్ మేనేజ్‌మెంట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని మారుస్తున్నారని, పలు కీలక అంశాలను ప్రధాన మీడియా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వాలు మీడియాను నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయని..అధికారాన్ని చూసి మీడియా భయపడడం ప్రారంభిస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కుమారుడిపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు, లగచర్ల ఘటన అంశాలను మెయిన్ స్ట్రీమ్ మీడియా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.
కాలానికి తగ్గట్టుగా మారాల్సిందే
ప్రభుత్వంలో ఉన్నవారే ముందుగా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని, వారు వాటిని మానేసిన తర్వాతే హేట్ స్పీచ్ బిల్లు తీసుకురావాలని కేటీఆర్ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌తో పాటు ప్రధాన మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలపై కూడా ఫ్యాక్ట్ చెక్ జరగాలని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఇటీవల యువత చేపట్టిన ఆందోళనలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సాగాయని, కొత్త తరానికి దేశంపై అపారమైన కమిట్‌మెంట్ ఉందని ఆ ఉద్యమం నిరూపించిందన్నారు. ప్రధాన మీడియా పట్టించుకోకపోయినా యువత దేశవ్యాప్తంగా చర్చను మార్చగలిగిందని వ్యాఖ్యానించారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఉనికి కోసం పోరాడుతుండగా, సోషల్ మీడియా ప్రభావం వేగంగా పెరుగుతోందన్నారు. రాయిటర్స్ స్టడీ ప్రకారం.. 18 నుంచి 24 ఏళ్ల యువతలో 56% మంది వార్తాపత్రికలు చదవడం లేదని, సోషల్ మీడియా ద్వారానే వార్తలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. నేటి తరం వార్తలను తమకు అవసరమైనప్పుడు మాత్రమే వినియోగిస్తోందని, మీడియా కూడా కాలానికి అనుగుణంగా మారకపోతే వెనుకబడిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు.