Reading Time: 2 minutes
Devi Movie: షూటింగ్‏లో డమ్మీ పాము అనుకుంటే నిజమైన పామొచ్చి కాటేసింది.. తర్వాత ఏం జరిగిందంటే.. వనీతా విజయ్ కుమార్..

నటి వనితా విజయకుమార్, దేవి సినిమా షూటింగ్‌కు సంబంధించి అద్భుతమైన, షాకింగ్ విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చాలా మంది గ్రాఫిక్స్ అనుకున్న పాము సన్నివేశం వాస్తవమని, తాను నిజమైన పాము కాటుకు గురైన విషయాన్ని ఆమె తెలియజేశారు. దర్శకుడు కోడి రామకృష్ణ ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారని, అప్పుడు సోషల్ మీడియా లేకపోవడంతో ఈ రహస్యం గోప్యంగానే ఉండిపోయిందని వనిత వివరించారు. దేవి సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు, దర్శకుడు కోడి రామకృష్ణకు ఒక కల వచ్చిందని వనిత తెలిపారు. ఆ కలలో, దేవి సినిమా సూపర్ హిట్ అవుతుందని, కానీ షూటింగ్ సమయంలో ముగ్గురు వ్యక్తులు మరణిస్తారని చెప్పబడిందని.. మొదట, ఒక మేనేజర్ నాగ పౌర్ణమి రోజున మరణించగా, ఆ తర్వాత సినిమాలో తన తండ్రి పాత్ర పోషించిన నటుడు కూడా చనిపోయారని చెప్పుకొచ్చారు. దీంతో చిత్ర బృందం, ముఖ్యంగా కోడి రామకృష్ణ తీవ్ర ఆందోళన చెందారని వనిత వివరించారు. దేవుడు ఏదో సంకేతం ఇస్తున్నాడని భావించి, అందరూ సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని దర్శకుడు నిర్ణయించుకున్నారు.

వనితా విజయకుమార్ పాములతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు. పెళ్లయిన మూడేళ్ల తర్వాత తన తల్లికి పిల్లలు లేకపోవడంతో, నాగుపామును పూజించి, మొక్కుకుంటే ఆమె గర్భం దాల్చారని, తాను జన్మించానని చెప్పారు. ఆమె అసలు పేరు నాగ లక్ష్మి మహేశ్వరి వనిత అని, మొదటి పేరు నాగ లక్ష్మి అని వనిత పేర్కొన్నారు. అందుకే పాములను దేవుడిగా, అమ్మవారి రూపంగా భావిస్తానని, తనకు ఎప్పుడూ భయం కలగలేదని ఆమె తెలిపారు.

షూటింగ్ సమయంలో, చిత్ర యూనిట్ అంతా పాము అంటే భయపడ్డారని, డమ్మీ స్నేక్ వాడాలని కోడి రామకృష్ణ సూచించారని వనిత చెప్పారు. అయితే, ఆ పర్టిక్యులర్ షాట్ సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) తో సాధ్యం కాదని తేలింది. వనిత ఏమాత్రం భయపడకుండా ముందుకు రావడంతో, తర్వాతి బాధితురాలు తనే అవుతుందేమోనని మిగిలిన వారు భయపడ్డారు. పాము పుట్ట దగ్గర ఒక పాట చిత్రీకరణ జరుగుతుండగా, వనిత మొక్కుకుంటున్నప్పుడు, పుట్టలోంచి నిజమైన పాము వచ్చి ఆమెను కుడిచేతికి పట్టుకుందని, అంటే కాటు వేసిందని వనిత వివరించారు. రక్తస్రావం కావడంతో సెట్‌లో అందరూ తీవ్ర ఆందోళన చెందారు. పాములు పట్టుకునేవారు మందు ఇచ్చినా, తన తల్లి దాన్ని తిరస్కరించారు. వనితకు పెన్సిలిన్ అలర్జీ ఉందని, అందువల్ల ఆసుపత్రికి వెళ్లాలన్నా కష్టం అయ్యిందని ఆమె తల్లి చెప్పారు. అందరూ భయపడినా, వనిత మాత్రం తనకు అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని, ఏం జరగదని నమ్మారు. ఆ నమ్మకంతోనే తనకు ఎటువంటి హానీ జరగలేదని ఆమె తెలిపారు.

సాధారణంగా, షూటింగ్‌ల కోసం పాములను ఉపయోగిస్తే, అవి కుట్టకుండా వాటి నోటిని కుట్టి ఉంచుతారు. కానీ దేవి సినిమాలో ఉపయోగించిన పామును అలా కుట్టలేదని, అది తనను కాటు వేసిందని వనిత స్పష్టం చేశారు. అయితే, ఈ ఘటన వల్ల ఆ సన్నివేశం సినిమాలో చాలా సహజంగా, అద్భుతంగా వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదని, ఇప్పుడే తనకు ఆ విషయం చెప్పే ధైర్యం వచ్చిందని వనితా విజయకుమార్ వెల్లడించారు. ఈ అనుభవాన్ని ఆమె ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నానని ముగించారు.