Reading Time: < 1 minute

ఆపరేషన్ ముస్కాన్‌‌‌‌‌‌‌‌లో 6 వేల 307 మంది చిన్నారుల రెస్క్యూ

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ‘ఆపరేషన్ ముస్కాన్–12’లో భాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను కాపాడారు. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రవ్యాప్తంగా 124 సబ్‌‌‌‌‌‌‌‌ డివిజన్ పోలీసు బృందాల్లో 620 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విమెన్ సేఫ్టీ వింగ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్ చారుసిన్హా శనివారం వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మొత్తం 6,307 మంది చిన్నారులను రక్షించామని.. అందులో 5,892 మంది బాలురు, 415 మంది బాలికలు ఉన్నారని వివరించారు. వీరిలో 3,447 మంది తెలంగాణకు చెందినవారు కాగా, 2,860 మంది ఇతర రాష్ట్రాలతో పాటు నేపాల్‌‌‌‌‌‌‌‌కు చెందినవారు కూడా ఉన్నారని చెప్పారు. కాపాడిన పిల్లల్లో 5,041 మంది బాల కార్మికులు, 647 మంది వీధి బాలలు, 43 మంది భిక్షాటన చేస్తున్నవారు ఉన్నారని తెలిపారు. 11 మంది ఇంటి నుంచి పారిపోయిన చిన్నారులు, డ్రాప్‌‌‌‌‌‌‌‌ అవుట్లు, బాల్య వివాహాలు, అక్రమ దత్తత వంటి ఇతర విభాగాల్లో 563 మంది చిన్నారులను గుర్తించినట్లు వెల్లడించారు.

1,705 కేసులు నమోదు
బాలలను కార్మికులుగా పెట్టుకున్న వారిపై 1,705 కేసులు నమోదు చేసి.. 1,710 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి 1,989 మంది చిన్నారులను రక్షించినట్లు చెప్పారు. కార్మిక శాఖ 1,381 తనిఖీ నివేదికలు జారీ చేయగా.. కనీస వేతనాల చట్టం కింద నిందితులకు రూ. 37.95 లక్షల జరిమానాలు విధించింది. 5,737 మందిని వారివారి కుటుంబాలకు అప్పగించగా, 570 మందిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు.

©️ VIL Media Pvt Ltd.