Reading Time: 2 minutes

జ్యోతిష్యం&ఆధ్యాత్మికం: శివపూజ.. శుభ ఫలితాలు.. ఏమంత్రం చదవాలి.. ఎప్పుడు..ఎలా చేయాలి..

Caption of Image.

హిందూ పురాణాల ప్రకారం శివపూజ చేస్తే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. శ్రీరామచంద్రుడు .. రావణాసురునిపై యుద్దానికి ముందు శివునికి అభిషేకం చేశాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  పరమేశ్వరుడికి సోమవారం అంటే చాలా  ప్రీతికరమైన రోజు. ఆ రోజున శివలింగానికి అభిషేకం చేసి, బిల్వదళం సమర్పించి భక్తితో శివుని ఆరాధిస్తే మానసిక ప్రశాంతత, శుభఫలితాలు, శివకటాక్షం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శివ పూజ వలన జాతకంలో దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది. 

హిందూ సంప్రదాయంలో సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున భక్తిశ్రద్ధలతో శివారాధన చేస్తే శివకృపతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని శివ మహాపురాణం, లింగ పురాణం వంటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది.

జ్యోతిష్యం ప్రకారం  సోమవారానికి అధిపతి చంద్రుడు. శివుడు తన జటాజూటంపై చంద్రుడు ఉంటాడు.  అందువలన పరమేశ్వరుడిని చంద్రశేఖరుడు  అని పిలుస్తారు. సోమవారం శివపూజ చేయడం ద్వారా చంద్రుని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఇతర దేవతల పూజలో అలంకరణకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, శివారాధనలో అభిషేకానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పవిత్ర జలంతో శివలింగానికి అభిషేకం చేస్తూ .. ఓం నమః శివాయ లేదా “హర హర మహాదేవ” అని జపిస్తే శివుడు సంతోషిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

శివుడు పంచభూత స్వరూపుడు 

లింగ పురాణం ప్రకారం శివుడు పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశ రూపాల్లో విశ్వమంతా వ్యాపించి ఉంటాడు. అందువల్ల ప్రతి శివలింగం విశ్వస్వరూపానికి ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో మట్టి లేదా ఇసుకతో చిన్న శివలింగాన్ని తయారు చేసి భక్తితో పూజించినా అదే పుణ్యఫలాన్ని అందిస్తాడని శాస్త్రాలు వివరిస్తాయి.

శివుని పూజా విధానం

  • శివపూజలో ఆడంబరాల కంటే భక్తికి ఎక్కువ విలువ ఉంది. సాధారణంగా ఈ విధంగా పూజ చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు.
  • పవిత్ర స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
  •   శివలింగానికి స్వచ్ఛమైన నీటితో లేదా పంచామృతంతో అభిషేకం చేయాలి.
  •   బిల్వదళాలను సమర్పించాలి.
  •  జిల్లేడు పూలు లేదా లభ్యమయ్యే సుగంధ పుష్పాలతో అలంకరించాలి.
  •  నారికేళం, అరటిపండు వంటి సాత్విక నైవేద్యాన్ని సమర్పించాలి.
  • “ఓం నమః శివాయ” మంత్రాన్ని  108 సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు.

సోమవారం చేయాల్సిన  పరిహారం

ప్రతి సోమవారం ఉదయం లేదా సాయంత్రం శివలింగానికి ఒక చెంబు స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసి, ఒక బిల్వదళాన్ని సమర్పించి, “ఓం నమః శివాయ” మంత్రాన్ని భక్తితో జపిస్తే శివకటాక్షం లభిస్తుందని విశ్వాసం. ఆర్భాటాల కంటే భక్తి, విశ్వాసం, చిత్తశుద్ధి ముఖ్యమని గుర్తుంచుకొని పరమేశ్వరుడిని ఆరాధిస్తే ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు జీవితంలో శుభఫలితాలు కలుగుతాయి.  సంతానం లేని వారు సోమవారం శివుడిని ప్రార్థించి.. ఉపవాస దీక్షను పాటిస్తే కచ్చితంగా సంతానం కలుగుతుంది. 

శివునికి బంగారం, వెండి, విలువైన కానుకలు అవసరం లేదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతాయి. నిర్మలమైన మనసుతో చేసే మానసిక పూజనే పరమేశ్వరుడు ఎక్కువగా స్వీకరిస్తాడని విశ్వాసం. భక్తుడు తన సుఖదుఃఖాలను శివునితో పంచుకోవడం, ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచడం, ప్రతి పరిస్థితిలో శివస్మరణలో ఉండడమే నిజమైన శివభక్తి అని మహనీయులు వివరించారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.