Reading Time: 3 minutes

ఇందులో అర్థం కానిది ఏమీ లేదు. అంతా కళ్లముందే ఉంది. ఇరాన్‌పై దాడుల గురించి అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నెన్ని అబద్ధాలు చెప్పినా, అందుకు ఏకైక కారణం ఆ రెండు దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాలని ప్రపంచానికంతా బోధపడుతూనే ఉంది. క్రమంగా బలహీనపడుతున్న అమెరికాకు కావలసింది తిరిగి ఏదో విధంగా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటం. ఇజ్రాయెల్ లక్షం గ్రేటర్ ఇజ్రాయెల్‌ను సృష్టించటం. ఈరెండింటికి పశ్చిమాసియా ప్రాంతానికి సంబంధించినంత వరకు కొరకరాని కొయ్యగా మిగిలింది ఇరాన్ ఒక్కటే. కనుక రకరకాల పచ్చి అబద్ధాలు చెప్తూ ఇరాన్‌పై ఉమ్మడిగా యుద్ధం మొదలుపెట్టారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా తాము చెప్తున్నవి ప్రతి ఒక్కటీ అబద్ధాలని తమ యూరోపియన్ మిత్రులతో సహా అందరికీ తెలిసిపోయినా వెనుకడుగు వేయటం లేదు. ఇటువంటి పచ్చి సామ్రాజ్యవాదం ఇంకా కొనసాగుతుండటం ప్రపంచానికి అనేక కష్టనష్టాలను కొనితెస్తున్నది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదం ఇచ్చి, అందుకోసం సవ్యమైన మార్గాన్ని ఈ 14 నెలల కాలంలో ఎన్నడూ అనుసరించలేదు. విచక్షణా రహితమైన సుంకాలతో, అమెరికన్ కంపెనీలు ఇతర దేశాల నుంచి తిరిగి రావాలనే బెదిరింపులతో, ఇతరులు తమ వద్ద భారీ పెట్టుబడులు పెట్టాలనే వత్తిడులతో, అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులను వెళ్లగొట్టటంతో తమ ఆర్థిక సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, వాణిజ్య లోటు వంటివన్నీ మటుమాయం కాగలవనుకున్నారు. కాని అధికారానికి వచ్చి 14 నెలలు గడిచినా వీటిలో ఒక్కటైనా పరిష్కారం దిశగా కదలకపోగా కొత్త సమస్యలు రావటం మొదలైంది. అన్నీ తన అసమర్థతకు రుజువులుగా నిలుస్తున్నాయి.

అటువంటి స్థితిలో సమీక్షలు జరిపి సవరణలు చేసుకునే బదులు, తమ సైనికబలమే తరుణోపాయ మనుకున్నారు. ఈ వక్రమైన ఆలోచనకు కొనసాగింపే ప్రస్తుత ఇరాన్ యుద్ధం. అమెరికా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు వేర్వేరు దేశాలలోని చమురు, అరుదైన ఖనిజాలు, లోహాలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని, ఇతర దేశాలను బ్లాక్ మెయిల్ చేసి తమకు అనుకూలమైన వాణిజ్య ఒప్పందాలను వారిపై రుద్దాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు గల వెనిజులాపై, అక్కడ నుంచి మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయనే అబద్ధాలు చెప్తూ గత జనవరిలో దాడిచేసారు. మాదకద్రవ్యాల ఆరోపణ నిజం కాదని సాక్షాత్తూ అమెరికన్ ప్రభుత్వ నివేదికలలోనే వెల్లడైంది. వెనిజులా చమురు నిక్షేపాలనంతా తమ అధీనంలోకి తెచ్చుకున్న వెనుక ఇపుడు ఇరాన్ చమురుపై కన్నువేసారు. ఇతరత్రా మాటలు ఎన్నెన్ని చెప్పినా అసలు లక్షం చమురు అన్నది బహిరంగ రహస్యం.

ఇరాన్ అణ్వస్త్ర తయారీకి ‘కొద్ది రోజుల’ దూరంలోనే ఉందని, అందువల్లనే ఆ ప్రమాదాన్ని నివారించేందుకు దాడి చేసామన్న అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటనలు హాస్యాస్పదమైన అబద్ధాలని వారికి కూడా తెలుసు. ఎందుకంటే ఇరాన్ అణు పరిశోధన కేంద్రాలపై నిరుడు జూన్‌లో దాడుల వల్ల అవి ‘పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి’నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఆ శిధిలాలు నేటికీ అదేవిధంగా ఉన్న స్థితిలో అణ్వస్త్రాల తయారీ కొద్ది రోజులలో జరగనుందనటం ఎవరూ నమ్మని బుకాయింపు మాత్రమే. పైగా, అస్త్రాల తయారీకి యురేనియం శుద్ధి 90 శాతం వరకు అవసరం కాగా, అది 60 శాతానికి ఎప్పుడూ మించలేదని అంతర్జాతీయ అణుఇంధన సంస్థతోపాటు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదికలు చెప్తున్నాయి. మరొక వైపు అణుశుద్ధి విషయమై అమెరికా, యూరప్ లతో ఇరాన్ గతంలో చర్చలు జరపటమే గాక, ప్రస్తుత దాడులకు ముందు కూడా జరుపుతున్నది. చర్చలు సంతృప్తికరంగా పురోగమిస్తుండినట్లు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమాన్ సైతం ప్రకటించింది. కనుక ట్రంప్, నెతన్యాహూల వాదనలు అన్నింటికి అన్నీ వంద శాతం అబద్ధాలు మాత్రమే.

పశ్చిమాసియాలోని భారీ చమురు నిల్వలు మొదటి నుంచి పాశ్చాత్య దేశాల యాజమాన్యంలో ఉండగా, ఇరాన్ నిల్వలపై వివాదం 1951 నుంచి మొదలైంది. అపుడు ప్రధానిగా ఎన్నికైన మొసాదెగ్ ఆ నిల్వలన్నింటిని జాతీయం చేయగా అందుకు ఆగ్రహించిన బ్రిటన్, అమెరికాలు తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను రంగంలోకి దింపి ఆయన ప్రభుత్వాన్ని కూలదోసాయి. ఈ కథకు కొనసాగింపే ఇపుడు అమెరికా ఆ నిల్వలను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు. అమెరికా గతంలో ఇరాక్, లిబియా వంటి దేశాలలో చేసింది కూడా ఇదే. ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి, రాజువంశపు వారసుడు రెజా పహ్లవీని విదేశాలనుంచి రప్పించి అధికారానికి తెచ్చి, చమురును కాజేయటం ట్రంప్ పన్నాగం. ఇది తమ స్వప్రయోజనంగా కాగా, మొత్తం పశ్చిమాసియాలో తమ ప్రయోజనాల పరిరక్షణను ఇజ్రాయెల్ చూస్తున్నదని ట్రంప్ స్వయంగా కొద్ది నెలల క్రితం తమ అధికారిక ప్యూహ పత్రంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఇజ్రాయెల్ ప్రయోజనాల పరిరక్షణ కూడా జరగాలి.

ఇజ్రాయెల్ ప్రయోజనాలు రెండు. ఒకటి, స్వతంత్ర దేశంగా పాలస్తీనా ఎట్టి పరిస్థితులలో ఏర్పడకపోవటం. అందుకు కొనసాగింపుగా గాజా, వెస్ట్ బ్యాంక్‌లను ఆక్రమించి గ్రేటర్ ఇజ్రాయెల్‌ను సృష్టించటం. రెండు, అమెరికా తోపాటు తమ ప్రణాళికలన్నింటికి ఏకైక ఆటంకంగా మిగిలిన ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోయటమే గాక ఒక దేశంగా విచ్ఛిన్నం చేయటం. ఈ మాటలను నెతన్యాహూ, ఆయన ముఖ్య సహచరులు ఎటువంటి దాపరికం లేకుండానే పదేపదే చెప్తున్నారు. అందువల్ల, ఇరాన్ అణ్వస్త్రం వగైరా మాటలన్నీ రుజువు చేయనక్కరలేని అబద్ధాలు, ఇందులో తాజా వార్త ఒకటున్నది. వెనిజులాలో మదురో వారసురాలిని ఎంపిక చేసినట్లే, ఇరాన్‌లో ఖమేనీ వారసుడిని కూడా తానే ఎంపిక చేస్తానన్న ది ట్రంప్ వాంఛ!

నాటకంలో ఉపనాటకంవలే ఒక వింత ఏమంటే, ఇరాన్‌పై దాడులకు కొన్ని లక్షాలు ప్రకటించిన ట్రంప్, వాటి గురించి తనకు స్పష్టత లేదని ఇపుడు స్వయంగా ఒప్పుకుంటున్నారు. యుద్ధం మొదట భావించినట్లు రెండు రోజులలో ముగియటం, ఇరాన్ అధినేత ఖమేనేయే హత్యతో ప్రభుత్వం కుప్పకూలటం, ట్రంప్ బహిరంగ పిలుపు ప్రకారం ప్రజలు తిరగబడి అధికారాన్ని వశపరచుకోవటం వంటివేమీ జరగకపోగా, ఇరాన్ సైన్యం ముందే హెచ్చరించినట్లు భీకరమైన ఎదురు దాడులు సాగిస్తుండటంతో, ట్రంప్‌ను అమెరికన్ కాంగ్రెస్ సభ్యులే సవాలు చేస్తున్నారు. మరొక వైపు కొన్ని యూరోపియన్ దేశాలు సహకరించకపోగా ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్ ఎదురు దాడులలో స్వయంగా పశ్చిమాసియాలోని అమెరికన్ సైనిక స్థావరాలు, నిఘా కేంద్రాలు, రాయబార కార్యాలయాలవంటివి దెబ్బతింటున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు గల గల్ఫ్ దేశాల మాట చెప్పనక్కరలేదు. ఆ వార్తలు రోజువారీగా వెలువడుతున్నవే అయినందున ఇక్కడ ఏకరవు పెట్టటం అనవసరం.

గమనించవలసిందేమంటే అమెరికా, ఇజ్రాయెల్ వంటి శక్తివంతమైన దేశాలు వారాల తరబడి సన్నాహాలు చేసాయి. తాము ఏక కాలంలో సైన్యాన్ని, వైమానిక బలాన్ని, నౌకా బలాన్ని ఇంతటి స్థాయిలో మోహరించటం చరిత్రలోనే ఎన్నడూ జరగలేదని అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు. ఇజ్రామెల్‌ది అదనపు బలం. ఇంత చేసినా ట్రంప్ మొదటి ప్రకటించిన లక్షాలలో ఒక్కటీ నెరవేరలేదు. ఖమేనీని హత్య చేసినా ప్రభుత్వం గాని, వ్యవస్థగాని కూలలేదు. రివల్యూషనరీ గార్డ్ అంతం కాలేదు. ప్రజలు తిరుగుబాటు చేయలేదు. అణు పరిశోధనా కేంద్రాలను కొత్తగా ధ్వంసం చేసేందుకు ఏమీ మిగిలిలేదు. ఇరాన్ లొంగిపోయి అమెరికా షరతులకు అంగీకరిస్తామంటూ పాగిలపడలేదు. చివరకు ఏది ఎట్లా జరిగినా, అసమతుల యుద్ధం (అసిమ్మెట్రిక్ వార్ ఫేర్) అనే వ్యూహాన్ని అనుసరిస్తూ పలు విధాలైన ఎదురుదాడులతో నష్టాలు కలిగిస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌లను, వారి గల్ఫ్ మిత్రులను హడలగొడుతున్నది. చర్చలకు సిద్ధమని ఇరాన్ అనకపోయినా, అన్నదని తానే అబద్ధాలు చెప్తూ, ట్రంప్ తన బలహీనతను బయటపెట్టుకుంటున్నారు. యుద్ధం గురించిన ప్రణాళిక ఏదీ తన వద్ద లేనట్లు ఆయన ఒప్పుకోవటం అమెరికాలో దుమారం రేపుతున్నది.

అట్లాగే యుద్ధం ఎంత కాలం సాగేదీ చెప్పలేనంటున్నారాయన. అమెరికా సైనిక స్థావరాలకు అవకాశం ఇచ్చిన దోషానికి గల్ఫ్ దేశాలు దెబ్బతింటూ దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. తమపై దాడులు చేస్తున్నందుకు ఇరాన్‌ను విమర్శిస్తున్న ఆ దేశాలు, ఇరాన్‌పై దుర్మార్గపు దాడి జరిపి దేశాధినేత ప్రాణాలు తీసిన అమెరికా, ఇజ్రాయెల్‌లను ఖండించకపోవటం వాటి ద్వంద్వ నీతి ఎత్తి చూపింది. ఈలోగా చమురు రంగంతో సహా ఆర్థిక వ్యవస్థలు గందరగోళంలో పడ్డాయి. ఇదే విధమైన నిందను భారత ప్రభుత్వం కూడా ఎదుర్కొంటుండటం మోదీ ప్రభుత్వపు దౌత్య నీతి వైఫల్యానికి తార్కాణంగా మారింది. వెనిజులాపై దాడి, అధ్యక్షుడు మదురో దంపతుల అపహరణను ఖండించక మౌనం వహించిన తర్వాత, ఇరాన్ దాడిని ఖండించకపోవటమే గాక దాడి చేసిన వారికే మద్దతు పలకటం మోడీ ప్రభుత్వంపు దౌత్య నీతి చరిత్రకు పెద్ద మచ్చగా మిగిలిపోనున్నది. 

– టంకశాల అశోక్ (దూరదృష్టి)

-రచయిత సీనియర్ సంపాదకులు