Reading Time: < 1 minute
Gulveer Singh Creates History Becomes First Indian To Win Two Athletics Medals At Commonwealth Games 2026

Gulveer Singh History in Commonwealth Games 2026: భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఒకే కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో రెండు పతకాలు గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా అరుదైన ఘనత అందుకున్నాడు. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 5000 మీటర్ల పరుగులో కాంస్య పతకం అందుకోవడంతో గుల్వీర్ ఈ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు జూలై 28న జరిగిన 10,000 మీటర్ల రేసులో రజత పతకం గెలిచాడు. 10000 మీటర్లు, 5000 మీటర్లలోనూ పతకం సాధించి భారత అథ్లెటిక్స్ చరిత్రలో గుల్వీర్ సింగ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

28 ఏళ్ల గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల ఫైనల్లో 13 నిమిషాల 24.95 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన మాథ్యూ కిప్‌చుంబా కిప్‌సాంగ్ 13:23.61 నిమిషాల టైమ్‌తో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ 13:24.70 నిమిషాలతో రజత పతకం గెలిచాడు. గుల్వీర్ చివరి ల్యాప్‌లో అద్భుతంగా పరుగెత్తి కెన్యాకు చెందిన కార్నెలియస్ కెంబోయ్‌ను కేవలం 0.04 సెకన్ల తేడాతో వెనక్కి నెట్టి కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సీజన్‌లో గుల్వీర్ సింగ్ అత్యుత్తమ టైమ్ 13:03.93 కాగా.. అతని జాతీయ రికార్డు 12:59.77. కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయినా.. ఒత్తిడిని తట్టుకుని పతకం సాధించడం విశేషం. 5000 మీటర్లు, 10000 మీటర్లలో జాతీయ రికార్డులు కలిగిన గుల్వీర్.. ఇప్పటికే 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో 10000 మీటర్లలో కాంస్య పతకం గెలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో రెండు పతకాలు సాధించడం ద్వారా గుల్వీర్ భారత అథ్లెటిక్స్‌కు కొత్త మైలురాయిని అందించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత క్రీడాకారుల సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిన అతడు.. రాబోయే అంతర్జాతీయ టోర్నీల్లో కూడా మరిన్ని విజయాలు అందుకోనున్నాడు. గ్లాస్గోలో గుల్వీర్ నమోదు చేసిన ఈ చారిత్రక ప్రదర్శన భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.