
హైదరాబాద్, వెలుగు: ఛాతి ఎముకను కోయకుండా, అత్యంత క్లిష్టమైన గుండె సర్జరీని రోబోటిక్ టెక్నాలజీతో గచ్చిబౌలి కిమ్స్ డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. రాజమండ్రికి చెందిన 37 ఏళ్ల యువకుడు ‘మైట్రల్ రిగర్జిటేషన్’ (వాల్వ్ లీకేజీ) సమస్యతో బాధపడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవాడు.
ఈ క్రమంలో కిమ్స్ గచ్చిబౌలిలోని చీఫ్ రోబోటిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నిసర్గ నేతృత్వంలోని వైద్య బృందం ఇటీవల 5 గంటల పాటు శ్రమించి ఈ రోబోటిక్ ఇంట్రాకార్డియాక్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది.
సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీలో ఛాతి ఎముకను కట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రోబోటిక్ పద్ధతిలో కేవలం చిన్న రంధ్రాల ద్వారానే వాల్వ్ రిపేర్ చేసినట్లు డాక్టర్ తెలిపారు. దీనివల్ల రక్తస్రావం, ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గి, నొప్పి తక్కువగా ఉంటుందన్నారు.
సర్జరీ ముగిసిన కొద్ది గంటల్లోనే వెంటిలేటర్ తొలగించగా, రోగి మరుసటి రోజే స్వయంగా నడవగలిగారని వైద్యులు తెలిపారు. ఈ విజయవంతమైన సర్జరీలో కార్డియాక్ సర్జన్ డాక్టర్ వినీత్, అనస్తీషియా నిపుణులు డాక్టర్ దివ్య, ఇతర డాక్టర్లు గోరింత, భవాని పాల్గొన్నారు.