
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మికనగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం (ఆగస్ట్ 2) ఉదయం మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో ఏడు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారు నడిపిన వ్యక్తి మైనర్ అని స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం ఎలా జరిగింది, కారు ఎంత వేగంతో ప్రయాణించింది అనే కోణంలో ఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించి విశ్లేషిస్తున్నారు. కారు నడిపిన వ్యక్తి మైనరా కాదా అని నిర్ధారించడానికి అతని గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. ఒకవేళ మైనర్ అని తేలితే కారు యజమాని లేదా బాలుడి తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ దిగ్భ్రాంతికర ఘటన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.