Reading Time: 2 minutes
అసలు యాంజియోగ్రామ్ అంటే ఏమిటి? ఎన్ని రకాలు..? ఎప్పుడు చేస్తారు..

యాంజియోగ్రామ్ అనేది శరీరంలోని రక్తనాళాల నిర్మాణం, వాటి ద్వారా రక్తప్రసరణ ఎలా జరుగుతోందో తెలుసుకోవడానికి చేసే ప్రత్యేక ఇమేజింగ్ పరీక్ష. గుండెకు మాత్రమే కాకుండా మెదడు, మెడ, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, చేతులు, కాళ్లు వంటి శరీరంలోని దాదాపు అన్ని అవయవాల రక్తనాళాలను పరిశీలించడానికి దీనిని ఉపయోగిస్తారు. రక్తనాళాల్లో ఎక్కడైనా ఇరుకుదనం, అడ్డంకి, ఉబ్బరం లేదా ఇతర అసాధారణ మార్పులు ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించడంలో యాంజియోగ్రామ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక ప్రాంతానికి రక్తం ఏ మార్గాల ద్వారా చేరుతుందో చూపించే రోడ్ మ్యాప్ లాగా ఇది పనిచేస్తుంది.

యాంజియోగ్రామ్ ప్రధాన రకాలు

1. సీటీ యాంజియోగ్రామ్ (CT Angiogram)

ప్రక్రియ: ఈ పరీక్షలో చేతి రక్తనాళంలో ఐవీ (IV) కాన్యులా ద్వారా అయోడిన్ ఆధారిత కాంట్రాస్ట్ డైని ఇంజెక్ట్ చేసి, సీటీ స్కాన్ సహాయంతో రక్తనాళాల చిత్రాలను తీస్తారు.

ప్రయోజనాలు:

ఇది నాన్-ఇన్వేసివ్ ఇమేజింగ్ పరీక్ష.

మత్తుమందు అవసరం ఉండదు.

ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం సాధారణంగా ఉండదు.

రక్తనాళాలతో పాటు సంబంధిత అవయవం, చుట్టుపక్కల భాగాలను కూడా స్పష్టంగా పరిశీలించవచ్చు.

ముఖ్యంగా చేతులు, కాళ్ల రక్తనాళాలను చివరి వరకు స్పష్టంగా చూడవచ్చు.

పరిమితులు:

కిడ్నీ పనితీరు తగ్గి ఉన్నవారిలో లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అయోడిన్ కాంట్రాస్ట్ డైని జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది.

కాంట్రాస్ట్ డైకి అలర్జీ ఉన్నవారిలో ప్రత్యామ్నాయ పరీక్షలను పరిగణలోకి తీసుకుంటారు.

2. ఎంఆర్ యాంజియోగ్రామ్ (MR Angiogram)

ప్రక్రియ: ఎంఆర్ఐ స్కానర్ ద్వారా రక్తనాళాల చిత్రాలను తీస్తారు. కొన్ని సందర్భాల్లో గాడోలినియం (Gadolinium) ఆధారిత కాంట్రాస్ట్ డైని ఉపయోగిస్తారు. అయితే అనేక సందర్భాల్లో డై లేకుండానే కూడా ఎంఆర్ యాంజియోగ్రామ్ చేయవచ్చు.

ప్రయోజనాలు:

కొన్ని పరిస్థితుల్లో కాంట్రాస్ట్ డై లేకుండానే పరీక్ష చేయడం సాధ్యమవుతుంది.

మెదడు, మెడ వంటి భాగాల రక్తనాళాలను అత్యంత స్పష్టంగా పరిశీలించడానికి ఉపయోగపడుతుంది.

అయోడిన్ కాంట్రాస్ట్ ఇవ్వలేని కొంతమంది రోగులకు ఇది మంచి ప్రత్యామ్నాయం.

పరిమితులు:

కాళ్లలో, ముఖ్యంగా మోకాలి కింది భాగంలోని చిన్న రక్తనాళాలను పరిశీలించడంలో సీటీ యాంజియోగ్రామ్‌తో పోలిస్తే క్లారిటీ కొంత తక్కువగా ఉండవచ్చు.

తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో గాడోలినియం కాంట్రాస్ట్‌ను జాగ్రత్తగా ఉపయోగిస్తారు.

3. క్యాథెటర్ యాంజియోగ్రామ్ / డిజిటల్ సబ్‌ట్రాక్షన్ యాంజియోగ్రఫీ (DSA)

ప్రక్రియ: ఇది అత్యంత కచ్చితమైన యాంజియోగ్రామ్ పద్ధతి. మణికట్టు లేదా తొడ భాగంలోని రక్తనాళం ద్వారా సన్నని క్యాథెటర్‌ను లోపలికి ప్రవేశపెట్టి, పరీక్ష చేయాల్సిన రక్తనాళం వరకు తీసుకెళ్తారు. అనంతరం కాంట్రాస్ట్ డైని నేరుగా రక్తనాళంలోకి పంపించి, ఎక్స్‌రే సహాయంతో చిత్రాలను తీస్తారు.ఈ విధానంలో డిజిటల్ సబ్‌ట్రాక్షన్ యాంజియోగ్రఫీ (DSA) సాంకేతికతను ఉపయోగించడం వల్ల రక్తనాళాలు అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి.

ప్రయోజనాలు:

రక్తనాళాల సమస్యలను అత్యంత ఖచ్చితంగా గుర్తించగలదు.

చికిత్స ప్రణాళిక రూపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

అవసరమైతే పరీక్షతో పాటు యాంజియోప్లాస్టీ, స్టెంట్ వేయడం వంటి చికిత్సలను కూడా అదే సమయంలో చేయవచ్చు.

పరిమితులు:

ఇది ఇన్వేసివ్ ప్రక్రియ.

కొంతసేపు ఆసుపత్రిలో పరిశీలనలో ఉండాల్సి ఉంటుంది.

తొడ ద్వారా పరీక్ష చేసినట్లయితే కొన్ని గంటలు విశ్రాంతి అవసరం కావచ్చు. మణికట్టు ద్వారా చేసినట్లయితే చాలా మంది త్వరగా నడవగలుగుతారు.

సూది వేసిన చోట రక్తం గడ్డకట్టడం (హెమటోమా), ఇన్ఫెక్షన్ లేదా అరుదుగా రక్తనాళానికి స్వల్ప నష్టం వంటి ప్రమాదాలు ఉండవచ్చు.

ఏ యాంజియోగ్రామ్ సరైనది?

ఏ రకమైన యాంజియోగ్రామ్ చేయాలనేది రోగి ఆరోగ్య పరిస్థితి, లక్షణాలు, అనుమానిస్తున్న వ్యాధి, కిడ్నీ పనితీరు, పరీక్ష ఉద్దేశ్యాన్ని బట్టి వైద్యుడు నిర్ణయిస్తారు. సాధ్యమైనంత తక్కువ రిస్క్‌తో గరిష్ట సమాచారాన్ని అందించే పరీక్షనే వైద్యులు ఎంపిక చేస్తారు. అందువల్ల, మీకు ఏ యాంజియోగ్రామ్ అవసరమో మీ వైద్యుడి సలహా మేరకు నిర్ణయించుకోవడం ఉత్తమం.