
- ఇవాళ ఉమ్మడి జిల్లాల పార్టీ
- ముఖ్య నేతలతో సమావేశాలు
- గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్
- మహేశ్ గౌడ్‌తో మంత్రి తుమ్మల,
- ఎంపీ వేం నరేందర్ రెడ్డి భేటీ
- 60 శాతం నామినేటెడ్ పోస్టులు
- పాత నాయకులకే ఇవ్వాలని నిర్ణయం
- పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్‌తోపాటు ఇతర పదవులన్నీ పాతోళ్లకే!
- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లపైనా కసరత్తు..త్వరలోనే ఢిల్లీకి నలుగురి పేర్లు
హైదరాబాద్, వెలుగు: నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ఈ విషయంలో కదలిక వచ్చినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే శనివారం గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎం సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పోస్టుల భర్తీపై చర్చించారు.
ఉమ్మడి జిల్లాలవారీగా అర్హుల జాబితాలను రూపొందిచాల్సిన బాధ్యతలను ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించారు. ఆదివారం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నేతలతో ఇన్‌చార్జి మంత్రులు సమావేశం కానున్నారు. నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీపై అందరి అభిప్రాయాలను తెలుసుకొని జిల్లాల వారీగా జాబితాలను సిద్ధం చేసి పీసీసీ అధ్యక్షుడికి పంపించనున్నారు. ఆయా జాబితాలపై చివరగా పీసీసీ అధ్యక్షుడు, సీఎం..ఇరువురు కలిసి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
పాత నేతలకే 60 శాతం పదవులు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భర్తీచేసిన పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో పాత కాంగ్రెస్ నేతలను కాదని, వలస నేతలకే ఎక్కువ పదవులు కట్టబెట్టారనే విమర్శలు వచ్చాయి. దీని వల్ల మొదటినుంచీ పార్టీ జెండా మోస్తున్న నేతలకు నష్టం జరిగిందని, వారంతా అసంతృప్తితో ఉన్నారని హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ప్రస్తుతం భర్తీ చేయబోయే పదవుల్లో పాత కాంగ్రెస్ నేతలకు న్యాయం చేయాలని హైకమాండ్సూచించినట్టు తెలుస్తున్నది.
ఈ క్రమంలోనే వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్, డైరెక్టర్ పదవులతోపాటు వ్యవసాయ మార్కెట్, దేవాలయ కమిటీల్లో గ్రామ, మండల స్థాయిలోని పాత కాంగ్రెస్ నేతలకే స్థానం కల్పించాలని పీసీసీ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. కనీసం 60 శాతం పదవులు గతంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారికి, కాంగ్రెస్ గత జిల్లా కార్యవర్గాల్లో ఉన్నవారికి, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు ఇవ్వాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లపైనా కసరత్తు
మరోవైపు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి అర్హులైన నేతల పేర్లను వెంటనే ఇవ్వాలని పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్‌ను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ఇటీవల ఆదేశించారు. దీంతో నాలుగు సామాజిక వర్గాల నుంచి రెండేసి పేర్లను పంపించడంపై పీసీసీ చీఫ్ కసరత్తు పూర్తిచేశారు.
రెడ్డి సామాజిక వర్గం నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఖైరతాబాద్ మాజీ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎస్టీ నుంచి ఎంపీ బలరాం నాయక్, ఏఐసీసీ ఆదివాసీ నేత బెల్లయ్య నాయక్, మైనార్టీ నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా పేర్లను పరిశీలిస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
పార్టీ కోసం కష్టపడేవారికే పదవులు: మంత్రి తుమ్మల
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌తో సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆదేశాలతోనే ఈ భేటీ జరిగిందని, నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలకు తగిన న్యాయం చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.