Reading Time: < 1 minute
Andhra Pradesh Launches Subsidized Rice Sales Bpt Rice Available At Rs 10 Less Per Kg

AP Govt Launches Subsidized Rice Sales: రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ తక్కువ ధరల బియ్యం విక్రయాలను ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు సబ్సిడీ ధరలో బియ్యాన్ని పంపిణీ చేసి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ తక్కువ ధరల బియ్యం అమ్మకాలు ప్రారంభమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ప్రస్తుతం మార్కెట్‌లో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.62కు విక్రయిస్తుండగా.. ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో అదే బియ్యాన్ని రూ.52కే అందిస్తున్నారు. అలాగే మార్కెట్‌లో రూ.58 ఉన్న బీపీటీ రా బియ్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో రూ.50కే విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్ ధరతో పోలిస్తే ప్రజలకు కిలోకు రూ.8 నుంచి రూ.10 వరకు ఆదా కానుంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల విక్రయ కౌంటర్ల ద్వారా తక్కువ ధరల బియ్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల భారం నుంచి కొంత ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందించడం ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని రైతు బజార్లు, రైస్ మిల్లుల కౌంటర్లలో ఈ సదుపాయాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు.