
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇరాన్‌పై భారీ సైనిక దాడులను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాము భారీ దాడులకు సిద్ధం కావడంతో ఒప్పందం కోసం ఇరాన్ ముందుకు వచ్చిందని తెలిపారు. ఇరాన్ అభ్యర్థన, పశ్చిమాసియాలోని తమ మిత్రదేశాల సూచన మేరకు రెండు కీలక షరతులతో దాడులు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను ఇరాన్ తక్షణమే పూర్తిగా తెరవడం.. అలాగే ఇరాన్ తన అణు కార్యక్రమాలకు సంబంధించిన ముప్పును పూర్తిగా తొలగించడంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచ భవిష్యత్ ప్రయోజనం.. అలాగే తమ దేశ మనుగడ కోసం ఇరాన్ వీలైనంత త్వరగా ఈ ఒప్పందం కుదుర్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికాతో కలిసి పనిచేయడానికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించిందని తెలిపారు.
కాగా, ఈ వారంతంలో ఇరాన్ పై విరుచుకుపడాలని.. ఆ దేశ చమురు రంగం, ప్రధాన ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేయాలని అమెరికా ఆర్మీకి ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మిడిల్ ఈస్ట్ లో ఏ నిమిషానా ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఇరాన్ పై తాత్కాలికంగా దాడులు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. గతకొన్ని రోజులుగా అమెరికా, ఇరాన్ పరస్పర భీకర దాడులతో అట్టుడికిన మిడిల్ ఈస్ట్ కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉండనుంది.