Reading Time: 2 minutes

కట్టడి చేయాల్సినోళ్లే.. కట్టు తప్పుతున్నరు..గంజాయి కేసులో కానిస్టేబుల్, రేప్ కేసులో ఎస్సై జైలుకు

Caption of Image.
  • సీపీవోలో జీతాల కుంభకోణం.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వసూళ్ల పర్వం
  • అవినీతి, అనైతిక కార్యకలాపాలతో పోలీస్ శాఖకు మచ్చ 

కరీంనగర్, వెలుగు: నేరాలను అరికట్టాల్సిన పోలీస్ శాఖలో పనిచేస్తూ కొందరు అవినీతి, అనైతిక కార్యకలపాల పాల్పడుతూ ఆ శాఖకు మచ్చ తెస్తున్నారు. క్రమశిక్షణతో ఉండాల్సిన పోలీసులు కట్టుతప్పుతున్నారు. కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు స్థాయితో సంబంధం లేకుండా పలువురు ఇటీవల వివాదాల్లో ఇరుక్కుని సస్పెన్షన్ కు గురయ్యారు. 

ప్రతి కేసులో ఇరువర్గాల నుంచి అందినకాడికి దండుకోవడం, లేదంటే డబ్బులు ముట్టజెప్పినోళ్ల వైపు నిలబడడం మెజార్టీ పోలీసాఫీసర్లకు అలవాటుగా మారింది. అంతేగాక తమ స్టేషన్ల పరిధిలో ఇసుక అక్రమ రవాణా, గుట్కా స్మగ్లింగ్, బెల్ట్‌‌‌‌ షాపుల నిర్వహణ, గ్రానైట్ ఓవర్‌‌‌‌లోడ్‌‌‌‌ లాంటి అక్రమాలు కళ్లెదుటే జరుగుతున్నా పోలీసాఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

గంజాయి కేసులో కానిస్టేబుల్.. రేప్ కేసులో ఎస్సై జైలుకు.. 

కరీంనగర్​లోని ఈగల్ టీమ్​లో పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ నాగరాజు భూవివాదంలో తన ఫ్రెండ్ కు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి షాపులో గంజాయి పెట్టి కేసులో ఇరికించడం వివాదాస్పదంగా మారింది. ప్రత్యర్థి కోసం తెప్పించిన కొంత గంజాయి తన ఇంట్లో పెట్టుకుని సదరు కానిస్టేబుల్ శుక్రవారం కటకటాలపాలయ్యాడు. గంజాయి, డ్రగ్స్ ను అరికట్టే ఈగల్ టీమ్ లో పనిచేసే కానిస్టేబుల్ కుట్రపూరితంగా ఒక వ్యాపారిని గంజాయి కేసులో ఇరికించడం, ఆ తర్వాత తాను ఇరకడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. 

హన్మకొండ జిల్లాలో ఏప్రిల్​లో నమోదైన రేప్ కేసులో జమ్మికుంట మాజీ ఎస్సై కదిరె శ్రీకాంత్ శుక్రవారం అరెస్టయి జైలు పాలయ్యాడు. మహిళలను సోషల్ మీడియా ద్వారా వలలో వేసుకొని లైంగిక దాడులు, బెదిరింపులకు పాల్పడిన కేసులో శ్రీకాంత్ అరెస్టయ్యాడు. 2025లో ఓ మహిళతో ఫేస్‌‌‌‌బుక్ ద్వారా పరిచయం పెంచుకొని ఏప్రిల్ లో హన్మకొండలోని ఆమె నివాసానికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 17న సుబేదారి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు కాగా శుక్రవారం అరెస్ట్ చేశారు. 

చనిపోయిన వారి పేరిట జీతాలు డ్రా.. 

కరీంనగర్ పోలీస్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పే సెక్షన్ ఉద్యోగి నీలం రామ్మోహన్‌‌‌‌ గతంలో పోలీస్ శాఖలో పనిచేస్తూ చనిపోయిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఐడీ నంబర్లను ఉపయోగించి ఐఎఫ్ఎం ఎస్ పోర్టల్ లో ఇతర వ్యక్తుల పేర్లను చేర్చాడు. ఆ తర్వాత వారి పేరుతో ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంటు తెరిచి, వాటికి తన మొబైల్ నంబర్ ను లింక్ చేయించాడు. ఇలా ముగ్గురి పేరిట 2022 నుంచి ఇప్పటివరకు రూ.1,40,18,308 దారి మళ్లించాడు. అతడికి రిటైర్డ్‌‌‌‌ ఏవోలతోపాటు మరో ముగ్గురు సహకరించారు. సీపీ ఆదేశాలతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.  

బైక్ అడ్డంగా పెట్టాడని యువకుడిపై దాడి

రోడ్డుకు అడ్డంగా బైక్‌‌‌‌ పార్కింగ్ చేశాడని కరీంనగర్‌‌‌‌ రాంనగర్‌‌‌‌లో ఒక యువకుడిపై ఆర్‌‌‌‌ఐ, ఇద్దరు ఆర్‌‌‌‌ఎస్సైలు చితకబాదడం, ఆ ఫుటేజీని అడ్డుపెట్టుకుని ఆర్ఐ, ఆర్ ఎస్సైలను రూ.5 లక్షల చొప్పున డిమాండ్ చేయమని.. తోటి ఆర్ ఎస్సైలు సదరు యువకుడికి సలహా ఇవ్వడం కలకలం రేపింది. దీంతో సలహా ఇచ్చిన ఇద్దరు ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐలపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో బ్లాక్‌‌‌‌ మెయిలింగ్‌‌‌‌ 
కేసు నమోదైంది.

డ్రంకెన్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ కేసుల్లో అక్రమ వసూళ్లు

కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​లో పనిచేసే ఆర్ఎస్సై శనిగల శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ కె.సాయికృష్ణ, డీడీ డిస్పోజల్ స్టేషన్ కానిస్టేబుల్ ఎన్.కిరణ్‌‌‌‌ కలిసి డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రాథమిక విచారణలో 14 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.34,700 అవినీతికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. 

మరో 100 కేసుల్లో డూప్లికేట్ లేదా రిపీటెడ్ ఎస్‌‌‌‌టీసీ నంబర్లను గుర్తించారు. దీంతో 2025 జనవరి నుంచి 2026 జూన్ 30 వరకు నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులపై సమగ్ర విచారణకు సీపీ గౌష్ ఆలం ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఆర్ఎస్సై శ్రీకాంత్, కె.సాయి కృష్ణ, కిరణ్‌‌‌‌ను సస్పెండ్ చేశారు.
 

©️ VIL Media Pvt Ltd.