
ఒకప్పుడు హైదరాబాద్ పేరు వినగానే బిర్యానీ, హలీం, ఇరానీ చాయ్ గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు ఇటాలియన్ పాస్తా నుంచి జపనీస్ సుషీ వరకు, థాయ్ కర్రీల నుంచి మెక్సికన్ టాకోస్ వరకు, లెబనీస్ షవర్మా నుంచి అమెరికన్ బర్గర్ల వరకు.. ప్రపంచ రుచులన్నీ ఇప్పుడు హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీలు, ప్రయాణాలు, సోషల్ మీడియా ప్రభావంతో సిటీలో గ్లోబల్ ఫుడ్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది.
హైదరాబాద్‌లోని అనేక రెస్టారెంట్లు ప్రపంచంలోని వివిధ దేశాల సంప్రదాయ వంటకాలను అందిస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని ట్రె ఫోర్ని ఇటాలియన్ పిజ్జా, పాస్తా, యూరోపియన్ వంటకాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని జొనాథన్స్ కిచెన్ ఇటాలియన్, కాంటినెంటల్, అంతర్జాతీయ వంటకాలతో ఆకట్టుకుంటోంది. బేగంపేటలోని థాయ్ పావిలియన్ అసలైన థాయ్ సూప్‌లు, కర్రీలకు ప్రసిద్ధి.బంజారాహిల్స్‌లోని హైకు జపనీస్, థాయ్, పాన్- ఏషియన్ వంటకాలను అందిస్తుండగా, హైటెక్ సిటీలోని చిల్లీస్ గ్రిల్ అండ్ బార్ మెక్సికన్, అమెరికన్ వంటకాలతో ఆహార ప్రియులను ఆకర్షిస్తోంది. ఎక్సోటికా రూఫ్‌టాప్ డైనింగ్‌తో పాటు ఇటాలియన్, ఆసియన్, కాంటినెంటల్ వంటకాలను వడ్డిస్తోంది.
ఒక్కో దేశానికి ఒక్కో రుచి
చైనీస్ వంటకాల కోసం మింగ్స్ కోర్ట్, లెబనీస్, మిడిల్ ఈస్టర్న్ వంటకాల కోసం లెవాంట్, మెడిటరేనియన్ రుచుల కోసం హమ్మస్ హౌస్, జపనీస్, పాన్ -ఏషియన్ వంటకాల కోసం హైకు, యి జింగ్, హాషి వంటి రెస్టారెంట్లు మంచి గుర్తింపు పొందాయి. అంతర్జాతీయ బఫే కోసం డెక్కన్ పావిలియన్, ఇటాలియన్ వెజిటేరియన్ వంటకాల కోసం సిబో హౌస్, సంప్రదాయ ఇటాలియన్ రుచుల కోసం లిటిల్ ఇటలీ, ఏసియన్, చైనీస్ వంటకాల కోసం గ్యాలరీ కేఫ్, ఫ్రెంచ్, అమెరికన్ స్టైల్ పిజ్జాల కోసం యూఎస్ పిజ్జా, చైనీస్, జపనీస్ వంటకాల కోసం హోలీ బాసిల్, లెబనీస్ వంటకాల కోసం స్పైస్ 6 నోరూరిస్తున్నాయి.
రుచుల్లో సంస్కృతి..
ప్రపంచ వంటకాల ప్రత్యేకత వాటి రుచిలోనే కాదు, తయారీ విధానంలోనూ ఉంటుంది. స్థానికంగా లభించే తాజా పదార్థాలు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలు, శతాబ్దాల చరిత్ర, ప్రాంతీయ సంప్రదాయాలు ప్రతి వంటకంలో తెలుస్తాయి. ఇటాలియన్ లసానియా, రిసొట్టో, పాస్తా, వుడ్-ఫైర్డ్ పిజ్జా నుంచి థాయ్ కొబ్బరి పాల కర్రీలు, లెమన్‌గ్రాస్ సూప్‌ల వరకు ప్రతి వంటకం ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది.
విదేశాలకు వెళ్లకుండానే ప్రపంచంలోని అనేక దేశాల వంటకాలను ఒకే నగరంలో ఆస్వాదించే అవకాశం హైదరాబాద్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రతి కొత్త రెస్టారెంట్ ఒక కొత్త దేశపు ఆహార సంస్కృతిని పరిచయం చేస్తుండగా, ప్రతి కొత్త వంటకం కొత్త రుచుల ప్రపంచంలోకి తీసుకెళుతుంది. బిర్యానీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ వంటకాలకు కూడా ఆతిథ్యమిస్తూ దేశంలోని ప్రముఖ గ్లోబల్ ఫుడ్ డెస్టినేషన్‌లలో ఒకటిగా మారింది.
భారతీయ రుచికి తగ్గట్టే మార్పులు
విదేశీ వంటకాల అసలు రుచిని కాపాడుతూనే భారతీయుల అభిరుచికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేసి అనేక రెస్టారెంట్లు వడ్డిస్తున్నాయి. దీంతో తొలిసారి విదేశీ వంటకాలను రుచి చూసే వారికి అవి సులభంగా నచ్చేలా మారాయి. శాకాహారులు, వెగన్ ఆహారం తీసుకునే వారి కోసం కూడా ప్రత్యేక మెనూలు అందుబాటులో ఉన్నాయి.