
నటులు వివేక్ ఒబేరాయ్, ఆర్ మాధవన్ పై తీవ్ర విమర్శలు చేశారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇండియాను అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అనిపిస్తే.. మరి ఇండియాలోనే ఉండొచ్చుకదా అని ప్రశ్నించారు. దుబాయ్ లో ఎందుకు స్థిరపడ్డారని ప్రశ్నించారు.
శనివారం ముంబైలో ఎంఎన్ఎస్ విద్యార్థి విభాగమైన మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ హయాంలో దేశంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలు తమ సంచులు సర్దుకుని దేశం విడిచి వెళ్ళిపోతున్నారని థాకరే అన్నారు.
మోదీపై సినిమా తీసి, అందులో మోదీ పాత్ర పోషించిన వివేక్ ఒబెరాయ్ కూడా దుబాయ్‌లో నివసించడానికి వెళ్లారు అని 2019లో విడుదలైన బయోపిక్‌ను ప్రస్తావించారు. ప్రధాని మోదీని పొగిడిన ఆర్. మాధవన్ ఎక్కడ నివసిస్తున్నారు? ఆయన దుబాయ్‌లో నివసిస్తున్నారు. మరి మీకు భారతదేశం అంటే అంత ఇష్టమైతే, ప్రధాని మోదీని అంతగా ప్రేమిస్తే, ఆయన భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని నమ్మితే, మరి పరాయి దేశంలో ఎందుకు నివసిస్తున్నారు? తమ కుటుంబాలతో కలిసి దుబాయ్‌లో ఎందుకు ఉంటున్నారు? అని థాకరే ప్రశ్నించారు.
వారు విదేశాల్లో నివసిస్తారని..ఇక్కడికి వచ్చి ప్రభుత్వం స్పాన్సర్ చేసే ధురందర్ వంటి చిత్రంలో పనిచేసి , ఆ తర్వాత దుబాయ్‌కి తిరిగి వెళ్ళిపోతారని ఆయన ఆరోపించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో తన కుమారుడి స్విమ్మింగ్ కెరీర్ కోసం దుబాయ్‌కి వెళ్లానని ఆర్ మాధవన్ చెప్పగా , వివేక్ ఒబెరాయ్ మాత్రం తన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు దుబాయ్‌కి వెళ్లినట్లు తెలిపారు.
►ALSO READ | నాబిడ్డకు ఇది పునర్జన్మ..దత్తత తీసుకొని భవిష్యత్తుకు సాయం చేయండి : మోదీని తిట్టిన బాలికతల్లి విజ్ణప్తి
మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో ప్రధాని మోదీపై ఉపయోగించిన భాష అనుచితమని, అలా విమర్శంచడం సరికాదని రాజ్ థాకరే అన్నారు .
బీజేపీ ప్రారంభించిన ట్రోల్స్ కల్చర్ కారణంగానే ఇలాజరుగుతుందన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మొదలుకొని థాకరేల ప్రముఖులను సైతం బీజేపీ ట్రోలర్స్ లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన అన్నారు. మనం ఏది నాటుతామో అదే మొలుస్తుందని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఇతరులకు కూడా తల్లులు ఉన్నారు, వారిని కూడా వేధించకూడదు అని ఆ పార్టీ ట్రోలర్స్ కు మోదీ చెప్పగలరా అని ప్రశ్నించారు.
నీట్ పేపర్ లీక్ ఉదంతం సీజేపీ నిరసనలు.. ఏళ్లుగా పేరుకుపోయిన వ్యవస్థలో లోపం, ఫిర్యాదుల పరాకాష్ట ఫలితంగానే సీజేపీ నిరసనలకు అంత స్పందన వచ్చిందని అభిప్రాయపడ్డారు.