
న్యూఢిల్లీ/ చెన్నై: పరీక్షల వ్యవస్థలో అవినీతికి ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు డిమాండ్ చేశారు. విద్యార్థులను క్షమించడం కాదు.. మోదీయే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ.. తనను, తన తల్లిని దూషించిన విద్యార్థులను క్షమించాలని భావిస్తున్నానని, సమాజం కూడా వారిని క్షమించాలని కోరారు. ఈ వీడియోపై రాహుల్ గాంధీ ఎక్స్‌లో స్పందిస్తూ.. అవినీతితో నిండిన పరీక్షల వ్యవస్థకు బాధ్యత వహిస్తూ విద్యార్థులకు మోదీయే క్షమాపణ చెప్పాలన్నారు.
నీట్ పేపర్ లీక్ కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాల్లో ఒక్క కుటుంబాన్ని కూడా మోదీ కలిసి ధైర్యం చెప్పలేదని ఆయన మండిపడ్డారు. ఎదిగిన బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను కలవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి లేదని, జీవితాంతం వారు ఆ బాధను మోస్తూనే ఉంటారని రాహుల్ గాంధీ చెప్పారు. పేపర్ లీక్ వల్ల, పరీక్షల రద్దు వల్ల పోయిన ప్రతీ ప్రాణం వెనుక ఓ కుటుంబం వేదన, విద్యావ్యవస్థపై సీరియస్ ప్రశ్నలు, సందేహాలు ఉంటాయని అన్నారు.
శనివారం తమిళనాడులో పర్యటించిన రాహుల్ గాంధీ.. నీట్ పేపర్ లీక్ కారణంగా చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రులను కలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ఓదార్పు పలికిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీక్, పరీక్ష రద్దు కారణంగా ఏళ్ల తరబడి శ్రద్ధగా ప్రిపేర్ అయిన విద్యార్థుల శ్రమ మొత్తం ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు.
మన విద్యావ్యవస్థ విద్యార్థులకు నిజాయితీగా పనిచేయాలని, కష్టపడి చదువుకోవాలని చెబుతుంది కానీ ఆ వ్యవస్థే వారిపట్ల నిజాయితీగా ఉండట్లేదని రాహుల్ విమర్శించారు. “సూసైడ్ చేసుకున్న విద్యార్థుల కుటుంబాల్లో ఒక్కరిని కూడా మోదీ కలుసుకోలేదు.. ఒక్క విద్యార్థితోనూ కూర్చుని మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సాహసించి విద్యార్థులను క్షమిస్తున్నా.. అని అంటున్నారు. నిజానికి ఆయనే వారికి క్షమాపణ చెప్పాలి” అని రాహుల్ డిమాండ్ చేశారు.
డీలిమిటేషన్ పేరుతో బీజేపీ కుట్ర నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) కు మద్దతు తెలపడమంటే తమిళనాడుకు, రాష్ట్ర భవిష్యత్తుకు ద్రోహం చేసినట్లేనని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలపై దాడి చేయడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలకు అనుమతించినట్లేనని వ్యాఖ్యానించారు. తమిళుల హక్కులను కాలరాయడానికి డీలిమిటేషన్ పేరుతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ప్రధాని మోడీ విక్టిమ్ కార్డు..
ఆందోళనల్లో భాగంగా తనను దూషించిన విద్యార్థులను క్షమించానని చెప్పడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. నిరసనలు చేస్తున్న విద్యార్థులపై అతి క్రూరంగా దాడి జరిగినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి తానే బాధితుడినన్నట్లు ప్రధాని వ్యవహరిస్తున్నారని విమర్శించింది.
‘శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ ఇన్ స్టాలో ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అందులో తాను విద్యార్థులను క్షమించేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది మన దేశాన్ని, మన యువతను అవమానించడమే. ఆయన క్షమాపణ కోరుతారని యువత ఎదురుచూస్తుంటే ఆయనేమో క్షమించానని చెబుతున్నారు. మోదీ ఇన్ స్టాగ్రామ్ సభలకు ఎవరూ మోసపోరు’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు.