Reading Time: 2 minutes
Watch Video : ‘నాకు శక్తినిచ్చేది ఆంజనేయ స్వామే’.. దేశభక్తితో కన్నీళ్లు పెట్టించిన గుల్వీర్ సింగ్

Watch Video : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఆయన సాధించిన విజయం కేవలం ఒక పతకానికే పరిమితం కాలేదు.. భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్‌లో అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు (10,000 మీటర్లలో వెండి, 5,000 మీటర్లలో కాంస్యం) సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుల్వీర్ నిలిచారు. ప్రస్తుతం భారతదేశపు నంబర్ 1 లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా అవతరించిన గుల్వీర్ ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

నా శక్తికి మూలం ఆంజనేయ స్వామి భక్తి మాత్రమే

5000 మీటర్ల రేసులో కాంస్య పతకం సాధించిన అనంతరం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గుల్వీర్ సింగ్ తన భక్తి శ్రద్ధల గురించి స్పందించారు. పోటీల సమయంలో నుదుటిపై రూపాయి పరిమాణంలో కనిపించే బొట్టు గురించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. తాను రోజూ హనుమంతుడిని పూజిస్తానని, స్వామివారి భక్తుడినని చెప్పారు. “నేను ప్రతీ రోజూ హనుమంతుడిని ఆరాధిస్తాను.. మైదానంలో పరుగెడుతున్నప్పుడు ఆ ఆంజనేయ స్వామే నాకు కొండంత అండగా నిలుస్తారు, ఆయనే నాకు ఈ శక్తిని ఇస్తారు” అని గుల్వీర్ ఆవేదన, ఆనందం కలగలిపిన స్వరంతో వ్యక్తపరిచారు.

రెండు పతకాలు వచ్చినా ఆనందం లేదు

ఒకే గేమ్స్‌లో రెండు మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించినప్పటికీ, తాను అంతగా సంతోషంగా లేనని గుల్వీర్ సింగ్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి గల కారణాన్ని వివరిస్తూ.. “గ్లాస్గో క్రీడా మైదానంలో నా దేశ జాతీయ గీతం (జనగణమన) మార్మోగాలని ఆశపడ్డాను. పసిడి పతకం గెలిచి ఉంటేనే అది సాధ్యమయ్యేది. అందుకే కాంస్య పతకం వచ్చినా నాకు పూర్తి సంతృప్తి లభించలేదు” అని తన దేశభక్తిని చాటుకున్నారు.

వాళ్లు కూడా మనుషులే

భారత సైన్యంలో నాయబ్ సుబేదార్‌గా విధులు నిర్వహిస్తున్న గుల్వీర్ సింగ్, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లో ఆఫ్రికన్ అథ్లెట్ల ఆధిపత్యంపై గట్టిగా స్పందించారు. “ఆఫ్రికన్ అథ్లెట్లు కూడా మనలాగే మనుషులు. వాళ్లను ఓడించడం అసాధ్యమేమీ కాదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మన క్రీడాకారుల కోసం భారీగా ఖర్చు చేస్తోంది, ప్రపంచ స్థాయి కోచ్‌లను, అన్ని వసతులను కల్పిస్తోంది. అలాంటప్పుడు మనం వాళ్లను ఎందుకు ఓడించలేం? రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్లను అధిగమించి చూపిస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.