
ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఉపశమనం ప్రకటించాయి. ఈ ఏడాది అనుమతించిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి రావడం, అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, టొబాకో బోర్డు , ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు వెల్లడించారు.
రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి బార్న్‌కు రూ.50 వేల చొప్పున రెండేళ్ల కాలానికి వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45 వేల బార్న్‌లకు కలిపి దాదాపు రూ.250 కోట్ల వరకు రుణ సదుపాయం లభిస్తుంది. దీనివల్ల దాదాపు 40 వేల మంది పొగాకు రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
మరోవైపు లో-గ్రేడ్, ఆఫ్-స్టైల్ పొగాకు అమ్మకాలపై జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. కిలోకు రూ.10 చొప్పున ధర లోటు భర్తీ చెల్లించేందుకు రూ.100 కోట్లను కేటాయించింది. ఈ మొత్తాన్ని వ్యవసాయ శాఖ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
వ్యాపారులు, ఎగుమతిదారులు కూడా రైతులకు మేలు జరిగేలా ధరలు చెల్లించేందుకు అంగీకరించారు. బ్రైట్ గ్రేడ్‌కు రూ.230, మీడియం గ్రేడ్‌కు రూ.190, లో గ్రేడ్‌కు రూ.110, ఆఫ్-స్టైల్‌కు రూ.130 చొప్పున కొనుగోళ్లు జరపనున్నారు. వేలం ప్రక్రియను వేగవంతం చేస్తూ రోజుకు 20 లక్షల కిలోల పొగాకును కొనుగోలు చేసి, రాబోయే రెండు నెలల్లో ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఇతర రాష్ట్రాల పొగాకు మార్కెట్‌లోకి రాకముందే మన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పెమ్మసాని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తీసుకున్న ఈ నిర్ణయాలు పొగాకు రైతులకు కొండంత అండగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.