Reading Time: 3 minutes

టైం తెల్లవారుజామున నాలుగు గంటలు.. ఇంకా గాఢ నిద్రలోనే హైదరాబాద్.. కానీ సిటీలోని ఓ మూలలో మాత్రం..

Caption of Image.

హైదరాబాద్లో ట్రెక్కింగ్ షూలు, క్యాంపింగ్ టెంట్లు, క్లైంబింగ్ రోప్లు, బ్యాక్‌‌‌‌ప్యాక్‌‌‌‌లు నేటి యూత్​ ట్రెండ్. సోషల్ మీడియాలో అందమైన ఫొటోల కోసం మాత్రమే కాదు.. ప్రకృతిని నిజంగా అనుభవించాలనే ఆసక్తితో యూత్​ సాహస క్రీడల వైపు అడుగులు వేస్తోంది.

డిజిటల్ వరల్డ్​లో ఎక్కువ సమయం గడుపుతున్న నేటి యువతకు ప్రకృతి ఒడిలో గడిపే ప్రతి క్షణం కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని అందిస్తున్నాయి ఈ అడ్వెంచర్స్​. నేషనల్ మౌంటేన్ క్లైంబింగ్ డే సందర్భంగా సాహసయాత్రలపై స్పెషల్ ​స్టోరీ.

సమయం తెల్లవారుజామున నాలుగు గంటలు..హైదరాబాద్ నగరం ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. కానీ హైదరాబాద్‌‌‌‌ శివార్లలోని ఓ మూలలో మాత్రం పదుల సంఖ్యలో యువతీ, యువకులు బ్యాక్‌‌‌‌ప్యాక్‌‌‌‌లు భుజాన వేసుకుని సిద్ధంగా నిలబడ్డారు. వారి గమ్యం ఓ ఎత్తైన కొండ శిఖరం. సూర్యుడు ఉదయించే లోపు శిఖరాన్ని చేరుకుని, మేఘాల మధ్యలో నుంచి తొంగిచూసే తొలి కిరణాలను ఆస్వాదించాలన్నదే వారి లక్ష్యం. కొండ ఎక్కడం వారికి కేవలం వ్యాయామం కాదు. అది తమ పరిమితులను అధిగమించే ప్రయాణం. ప్రకృతిని దగ్గరగా అనుభవించే అవకాశం. సిటీ లైఫ్లోని ఒత్తిడి, కాలుష్యానికి కాసేపు దూరంగా వెళ్లి, తమతో తాము గడిపే సమయం.

ఎన్నెన్నో అడ్వెంచర్ క్లబ్లు
చిన్నప్పటి నుంచి సాహసాలంటే ఇంట్రెస్ట్ ఉన్న దియానత్  అలీ సమయం దొరికినప్పుడల్లా ట్రెక్కింగ్‌‌‌‌లకు వెళ్లేవారు. ఆ ఇంట్రెస్ట్ వల్లే గ్రేట్​ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ప్రారంభించాడు. సిటీలో 63వేల మంది ఫాలోవర్లు ఉన్న ఈ క్లబ్ అవుట్ డోర్, నేచర్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ సాహసయాత్రలు చేపడుతోంది. గత15 సంవత్సరాలుగా ఆరువేలకు పైగా ట్రెక్‌‌‌‌లు, 300 ఎత్తైన మౌంటెన్​ట్రెక్‌‌‌‌లు, వెయ్యి సాహస శిబిరాలు, సాహస క్రీడలు నిర్వహించింది. ప్రకృతి, సాహసం, పర్యావరణ పరిరక్షణ అనే మూడు లక్ష్యాలతో ప్రారంభమైన ఈ క్లబ్, నేడు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ అడ్వెంచర్ కమ్యూనిటీలలో ఒకటిగా నిలిచింది.

ఇదేకాకుండా హైదరాబాద్ ట్రెక్కింగ్ కంపెనీ ఫేస్​బుక్​లో 89 వేల మంది ఫాలోవర్లతో ట్రెక్కింగ్, హైకింగ్, రాక్ క్లైంబింగ్ యాత్రలు నిర్వహిస్తోంది. సైనిక్​పురికి చెందిన హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ 45వేల మంది ఫేస్ బుక్ ఫాలోవర్లతో ప్రతీ నెలా సాహసయాత్రలు చేపడుతోంది. హైదరాబాద్ ట్రావెల్ క్లబ్ ట్రెక్కింగ్, క్యాంపింగ్, అడ్వెంచర్, ట్రావెలింగ్ యాత్రలు నిర్వహిస్తోంది.

ఇండిపెండెన్స్ డే స్పెషల్..
ఇండిపెండెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ఆగస్టు నెలలో లాంగ్ వీకెండ్ అడ్వెంచర్స్​ నిర్వహించనుంది. ఊటీ, కొడైకెనాల్, కూర్గ్, వైజాగ్, గోకర్ణ, లోహఘడ్, హంపీ, కేరళ వంటి ప్రాంతాలకు అడ్వెంచర్ టూర్ ఉంటుందని హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ప్రతినిధి శ్రావ్య చెప్పారు. ఈ యాత్రలకు దాదాపు ఐదు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల దాకా చార్జ్ చేస్తున్నారు. ఒక్కో టీంలో10 –15 మంది సభ్యులు ఉంటారు.

హైదరాబాద్ ట్రెక్కింగ్ కంపెనీ, మాన్ సూన్ గెట్ ఎవే పేరిట రాజ్ ఘడ్ ఫోర్ట్ ట్రెక్, మహాబలేశ్వర్ అండ్ పంచగనీ రాజా–రాణి కాంబో యాత్ర చేపట్టింది. వాటర్ ఫాల్స్ స్పెషల్, హరిశ్చంద్ర ఘడ్ వైబ్స్ సాహస యాత్రలు చేపట్టింది. హైదరాబాద్ ట్రావెల్ క్లబ్ హైదరాబాద్ టు సోమశిల, చీరాల బీచ్, ఎత్తిపోతల జలపాతం టూర్స్ నిర్వహిస్తోంది.

మహిళలు కూడా..
మహిళలు కూడా ఈ అడ్వెంచర్స్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉద్యోగినులు, విద్యార్థినులు, గృహిణులు కూడా ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, క్యాంపింగ్‌‌‌‌లో తమ సత్తా చాటుతున్నారు. భద్రతా ప్రమాణాలు, అనుభవజ్ఞులైన శిక్షకులు, జట్టు సహకారం మహిళల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయంటారు మహిళా ట్రెక్కర్లు.

హైదరాబాద్‌‌‌‌లో సాహసాలకు గమ్యస్థానాలు
హైదరాబాద్‌‌‌‌లోని ఖాజాగూడ కొండలు, దుర్గం చెరువు, భువనగిరి కోట, అనంతగిరి కొండలు వారాంతపు విహార యాత్రికులకు ఇష్టమైన ప్రదేశాలుగా మారాయి. బౌల్డరింగ్  వర్క్‌‌‌‌షాప్‌‌‌‌ల నుంచి మోడర్న్​ క్లైంబింగ్ మీటప్‌‌‌‌ల వరకు, హైదరాబాద్ క్లైంబర్స్ ఖాజాగూడ హిల్స్, పీరంచెరువు, ఇండోర్ జిమ్‌‌‌‌లలో సెషన్‌‌‌‌లను నిర్వహిస్తుంది.

ఎన్నెన్నో సాహస ఈవెంట్స్..
పాన్-ఇండియా ట్రెక్స్ సభ్యులు పశ్చిమ కనుమలు, లడఖ్, మిజోరం, రాజస్థాన్‌‌‌‌లలో ట్రెక్స్​లో పాల్గొన్నారు. భువనగిరి కోటలో రాపెల్లింగ్ నుంచి గోవాలో స్కూబా డైవింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 300 మందికి పైగా అథ్లెట్లతో సిటీలో మొట్టమొదటి ట్రయాథ్లాన్‌‌‌‌ను నిర్వహించారు. రాకథాన్ సొసైటీ టు సేవ్ రాక్స్ సహకారంతో రాక్ క్లైంబింగ్ ఫెస్ట్​ చేశారు. నిరుపేద పిల్లల కోసం కూడా ట్రెక్కింగ్‌‌‌‌లు నిర్వహించారు.

పర్యావరణ అవగాహనను పెంపొందించడానికి సరస్సుల శుభ్రత, బయోడైవర్సిటీ ఫొటో షూట్​లు, పక్షులను వీక్షించే ట్రెక్కింగ్‌‌‌‌లు నిర్వహించారు. ఫిట్‌‌‌‌నెస్, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, టీం స్పిరిట్.. ఈ నాలుగింటినీ ఒకేసారి అందించే లైఫ్​స్టైల్​గా మారుతున్న ఈ అడ్వెంచర్స్​.. ప్రకృతి ఒడిలో ప్రతి అడుగు కొత్త అనుభవాన్ని, ప్రతి శిఖరం కొత్త విజయాన్ని అందిస్తోందని అంటోంది నేటి యూత్.

ప్రతి ఏడాది హిమాలయాలకు..
అమెరికన్ కంపెనీలో కన్సల్టెంట్‌‌‌‌గా పనిచేసే సల్మాన్ హైదరాబాదీ. ఆయన ఏటా ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ట్రెక్కింగ్‌‌‌‌కు వెళ్తుంటారు. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పుష్పలోయ ట్రెక్కింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చమోలి జిల్లాలో 87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పుష్పలోయ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. మంచుతో కప్పబడిన శిఖరాలు, హిమానీనాదాలు, జలపాతాలు, 300కు పైగా అడవి పూల జాతులతో ఈ లోయ మంత్రముగ్ధులను చేస్తుందంటారు సల్మాన్.

హిమాలయ నల్ల ఎలుగుబంట్లు, ఎగిరే ఉడుతలు వంటి అరుదైన వన్యప్రాణులకు కూడా ఇది నిలయం. జులై మధ్య నుంచి ఆగస్టు మధ్య వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైన సమయం. ఈ ట్రెక్కింగ్‌లో పాల్గొనాలంటే యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వం ఉండాలి.18 సంవత్సరాలు నిండిన వాళ్లు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి.

హైదరాబాద్ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి రిషికేశ్ బేస్ క్యాంప్‌కు చేరుకుని కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ముందస్తుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ఫీజు చెల్లించాలి. ట్రెక్కింగ్ బూట్లు, మందపాటి దుస్తులు, రెయిన్‌కోట్, గ్లోవ్స్, మెడిసిన్​, టాయిలెట్రీస్, పాత్రలు, సభ్యత్వ కార్డు, మెడికల్ సర్టిఫికెట్ వంటి అవసరమైన సామాగ్రిని వెంట తీసుకెళ్లాలి.

©️ VIL Media Pvt Ltd.