
Peru: పెరూ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నాజ్కా (Nazca) నగరానికి సమీపంలో పర్యాటకులను తీసుకెళ్తున్న ఓ చిన్న విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న 13 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. పర్యాటకులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాజ్కా లైన్స్ (Nazca Lines) చూపించేందుకు ఈ విమానం ప్రత్యేకంగా సైట్‌సీయింగ్ ఫ్లైట్‌గా బయలుదేరింది. విమానం సమీపంలోని ఇకా (Ica) నగరం నుంచి టేకాఫ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ విమానాన్ని పెరూకు చెందిన ఎయరోడియానా (Aerodiana) సంస్థ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గత 14 ఏళ్లుగా సెస్నా గ్రాండ్ కారవాన్ (Cessna Grand Caravan) విమానాలతో నాజ్కా లైన్స్‌పై పర్యాటకులకు వీక్షణ యాత్రలను అందిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే ప్రమాదం అనంతరం సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ విమానం పిస్కో విమానాశ్రయం నుంచి బయలుదేరి నాజ్కా లైన్స్ వైపు ప్రయాణిస్తుండగా.. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆ తర్వాత విమానం కూలిపోయినట్లు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ మైదానంలో విమానం శకలాలు చెల్లాచెదురుగా పడి ఉండగా.. వాటి నుంచి దట్టమైన పొగ ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వీడియోల ప్రామాణికతను అధికారులు ఇంకా ధృవీకరించలేదు.
నాజ్కా లైన్స్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పురాతత్వ కట్టడాల్లో ఒకటి. ఎడారిలో శతాబ్దాల క్రితం స్థానికులు రూపొందించిన భారీ జియోగ్లిఫ్‌లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జంతువుల ఆకారాల్లో ఉన్న ఈ చిత్రాలు పూర్తిగా విమానం లేదా ప్రత్యేక వీయింగ్ టవర్ నుంచి మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ప్రతి ఏడాది సుమారు లక్ష మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు.
ప్రమాదానికి ఒక రోజు ముందు నాజ్కా సమీపంలోని మారియా రీచే విమానాశ్రయం నుంచి నిర్వహించే సైట్‌సీయింగ్ విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గంటకు 40 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలుల కారణంగా భారీగా దుమ్ము ఎగసి విజిబిలిటీ తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే కారణంతో రెండు పర్యాటక విమానాలను మార్కోనా విమానాశ్రయానికి మళ్లించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఘోర ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు పెరూ విమానయాన అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం వెనుక సాంకేతిక లోపమా, వాతావరణ పరిస్థితుల ప్రభావమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
BREAKING
: 13 KILLED IN TOURIST PLANE CRASH OVER PERU’S NAZCA LINES
A small tourist plane carrying 11 passengers and two pilots crashed during a sightseeing flight over Peru’s Nazca Lines, killing all 13 people on board, according to Peruvian authorities. pic.twitter.com/dwSFDEEt1E
— TheIndependent (@WeIndependent0) August 1, 2026
BREAKING