Reading Time: 3 minutes
భాగ్యనగరంలో బోనాల సందడి.. వెయ్యేళ్ల ఆచారం.. బ్రిటిష్ కాలంలో ఏం జరిగింది

ఆషాడ మాసం వచ్చిందంటే తెలంగాణ నేల ఆధ్యాత్మిక భావంతో పులకించిపోతుంది. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు, విశిష్టమైన ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. హైదరాబాద్ మహానగరం అమ్మవారి నామస్మరణతో మార్మోగిపోతుంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ నెల రోజుల పండుగ సంబరాలు మొదలయ్యాయి. లంగర్‌హౌస్‌ నుంచి పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మోతల మధ్య రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ బంగారు బోనం, పట్టువస్త్రాలను అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ వేడుకల ప్రారంభంలో ఒక అద్భుతం కూడా జరిగింది! తొలి రోజే వరుణ దేవుడు కరుణించి వర్షం కురిపించడంతో భక్తులు మరింత ఆనందోత్సాహాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా కొత్త కుండలో అన్నం, బెల్లం, పెరుగు, నెయ్యితో నైవేద్యాన్ని తయారుచేసి… సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ అంటువ్యాధుల నుండి రక్షణ పొందాలని వేడుకోవడం మన ఆచారం.” “విశ్వనగరం హైదరాబాద్‌ లో గల్లీ నుంచి కాలనీల దాకా ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. ఒకవైపు పోతురాజుల వీరనృత్యాలు, మరొకవైపు శివసత్తుల పూనకాలు, ఇంకోవైపు డప్పు చప్పుళ్లు, భక్తిగీతాల ఆలాపనలు! భాగ్యనగరంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. ఘటాల ఊరేగింపులు, డప్పుల మోతల మధ్య అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గ్రామదేవతలైన ముత్యాలమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, మహంకాళమ్మలకు మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పండుగ కేవలం ఒక్క ఆలయానికో లేదా ప్రాంతానికో పరిమితం కాదు. తొలుత గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించిన అనంతరం రెండోవారం బల్కంపేట ఎల్లమ్మ అలయం, ఆ తర్వాత వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి, నాలుగోవారం పాతబస్తీ లాల్‌దర్వాజా అమ్మవారికి ఒక క్రమ పద్దతిలో బోనం సమర్పిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. నాలుగోవారం మాత్రం హైదరాబాద్‌ నగరం మొత్తం శివసత్తుల పూనకాలతో ఊగిపోతుంది. ఆ రోజున జీహెచ్‌ఎంసీ పరిధిలోని సుమారు 3,000 ఆలయాల్లో ఈ బోనాల ఉత్సవాలను క్రమ పద్దతిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భివించిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ బోనాల నిర్వహణను సర్కారు.. అధికారికంగా నిర్వహిస్తూ వస్తోంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ. 20 కోట్ల నిధులను కేటాయించింది. ఈసారి పెద్ద ఆలయాలతో పాటు చిన్న చిన్న గ్రామ, బస్తీ ఆలయాలకు కూడా నిధులు కేటాయించినట్లు మంత్రులు వెల్లడించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో సేవలందిస్తున్నాయి. తాగునీటి సదుపాయం, నిరంతర పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.” అసలు ఈ బోనాల పండుగ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో మీకు తెలుసా? ఈ బోనాల పండుగ నేటిది కాదు… దాదాపు 1000 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పండుగ! కాకతీయ రాజుల కాలం నుంచే ఈ సాంప్రదాయం ఉందని చెబుతారు. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత పాలించిన ముస్లిం నవాబులు సైతం ఈ పండుగ విశిష్టతను, ప్రజల నమ్మకాన్ని గుర్తించి పూజలు చేసుకునేందుకు సంపూర్ణ అనుమతులు ఇచ్చారు. గోల్కొండ కోట మీద జగదాంబిక అమ్మవారి ఆలయం అత్యంత పురాతనమైనది కాబట్టే, ప్రతి ఏటా తొలి బోనం ఇక్కడే సమర్పించడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. తొలి బోనం గోల్కొండలో సమర్పిస్తారు. రెండవ బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో ఇస్తారు. మూడో బోనం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, నాలుగో బోనం లాల్‌దర్వాజ సింహవాహినికి ఎత్తుతారు. చరిత్రను పరిశీలిస్తే.. 1907 సంవత్సరంలో లాల్ దర్వాజ బోనాలను మహారాజా కిషన్ ప్రారంభించారు. ఈ బోనాల జాతరకు అప్పటి హైదరాబాద్ నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ భూమిని విరాళంగా ఇచ్చారు. అంతేకాదు అనేక ఆలయాల నిర్మాణాలను భూమిని దానంగా ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉందని చెబుతారు. ఈ ఆలయం దాదాపు 200 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికుల నమ్మకం. ఉజ్జయిని మహాంకాళి దేవాలయం 1815లో నిర్మితమైనది. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. 1813 సంవత్సరంలో ఉద్యోగ రీత్యా ఆయనను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్ది రోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది మృతి చెందారు. ఆ సమయంలో అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఉజ్జయినిలో కలరా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించి, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్ లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామనీ మొక్కుకున్నారంట. తన బిడ్డలను ఎల్లప్పుడూ రక్షించే ఆ అమ్మవారు కరుణ వల్ల కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి కూడా తగ్గుముఖం పట్టింది. అంతట అమ్మవారి కరుణ వల్లనే ఇదంతా జరిగిందని విశ్వసించిన సురటి అప్పయ్య, ఆయన మిత్రులు 1815లో ఉజ్జయిని నుంచి సికింద్రాబాద్‌కు వచ్చి, అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేశారు. నాటి నుంచి ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసంలో సికింద్రాబాద్‌లో ‘లష్కర్ బోనాలు’ అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి బోనాల పండుగలో అత్యంత కీలకమైనది, భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేది ‘రంగం’. ప్రధాన బోనాల సమర్పణ జరిగిన మరుసటి రోజున ‘రంగం’ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఒక మహిళ పచ్చి మట్టికుండపై నిలబడి పూనకంతో భవిష్యవాణి వినిపిస్తుంటుంది. రాబోయే కాలంలో వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, ప్రజల ఆరోగ్యం ఎలా ఉండబోతోంది అనే విషయాలపై ‘భవిష్యవాణి’ వినిపిస్తుంది. అనంతరం లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు మరియు భాగ్యనగరంలోని ప్రధాన దేవాలయాల్లో ఉత్సవాలు పరాకాష్టకు చేరుకుంటాయి. ఆ తర్వాతి రోజు అమ్మవారి శాంతి కళ్యాణం, ఘటాల ఊరేగింపు మరియు అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు అంబారి మీద వైభవంగా ఊరేగింపు కార్యక్రమం నిర్విహిస్తారు. ఆషాఢ మాసంలోనే ఈ బోనాలు ఎందుకు జరుపుకుంటారు? అంటే తెలుగు సంప్రదాయం ప్రకారం, కొత్తగా పెళ్లైన కుమార్తె ఆషాఢ మాసంలో పుట్టింటికి రావడం ఆనవాయితీ. జగన్మాత అయిన ఆ పరాశక్తి కూడా ఈ నెలలో తన భక్తులను చూడటానికి భూమిపైకి, అంటే తన పుట్టింటికి వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే అమ్మవారిని కన్న కూతురిలా భావించి బోనం, పసుపు, కుంకుమ, చీర, సారె, పండ్లు, పూలతో ఘనంగా సత్కరిస్తారు. మహిళలు ఎంతో నిష్టతో అన్నం, పాలు, బెల్లం, పెరుగు కలిపి మట్టి లేదా రాగి కుండలో నైవేద్యాన్ని వండుతారు. ఆ కుండకు వేపాకులు, పసుపు, కుంకుమతో మంగళకరంగా అలంకరిస్తారు. కుండ పైన ప్రమిద ఉంచి దీపం వెలిగిస్తారు. ఈ బోనాన్ని నెత్తిన పెట్టుకుని, మేళతాళాల మధ్య ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి నివేదిస్తారు. ఈ పండుగ కేవలం తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలోని రాయలసీమ, కర్ణాటకలోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో కూడా వైభవంగా జరుపుకోవడం విశేషం. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలువుటద్దం ఈ ఆషాఢ బోనాలు! అమ్మవారి ఆశీస్సులు అందరిపైనా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Burj Khalifa: గుడ్‌న్యూస్.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు

మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తోందా.. ఇదిగో సరికొత్త ట్రిక్ ‘కాఫీ నాప్’

ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!

మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!