
Amrapali Dubey: భోజ్‌పురి సినిమా సూపర్‌స్టార్ ఆమ్రపాలి దూబే రియాలిటీ షో ‘భోజ్‌పురి బవాల్’లో కనిపించనున్నారు. ఈ షో ప్రారంభం కాకముందే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా ప్రోమోలో ఆమ్రపాలి దూబే షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. తాను తల్లి కావాలను కుంటున్నట్లు తెలిపింది. ‘భోజ్‌పురి బవాల్’ కొత్త ప్రోమోలో ఆమ్రపాలి దూబే.. దినేష్ లాల్ యాదవ్ ‘నిరహువా’, కుటుంబ సభ్యుల ముందు తన మనసులోని మాటను చెప్పారు. గుడిలో దండం పెట్టుకున్న తర్వాత నిరహువా ముందు కూర్చుని మాట్లాడుతూ.. “నా జీవితంలోనే బహుశా అత్యంత పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను. దీని ఫలితం ఎలా ఉంటుందో, నా కుటుంబం, అభిమానులు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. కానీ నేను ఇది చేయాలనుకుంటున్నాను.. నేను తల్లిని కావాలనుకుంటున్నాను” అని తెలిపారు.
ఆమె మాట వినగానే తండ్రితో సహా ఇంట్లోని సభ్యులంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది అంత సులభం కాదని నిరహువా అనగా, ఒంటరిగా బిడ్డను పెంచడం సులభం కాదని తెలుసంటూనే ఆమ్రపాలి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంట్లో వాళ్లంతా పెళ్లి.. పెళ్లి అని ఒత్తిడి తెస్తున్నారని ఆమె అనగా, “అయితే నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు?” అని నిరహువా ప్రశ్నించారు. ఆయన మాటలకు ఆమ్రపాలి ఆశ్చర్యపోయారు. ఈ ప్రోమో బయటకు వచ్చాక ఆమ్రపాలి పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతున్నారా అని కొందరు ఊహాగానాలు చేస్తుండగా, ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు నిజమేంటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షో విషయానికి వస్తే, ‘భోజ్‌పురి బవాల్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహోట్‌స్టార్ (JioHotstar) లో ఆగస్టు 2, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఇదొక భోజ్‌పురి రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ షో. ఇందులో దినేష్ లాల్ యాదవ్ ‘నిరహువా’, పవన్ సింగ్, కాజల్ రాఘవానీ సహా భోజ్‌పురి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ నటీనటులు అలరించనున్నారు.