Reading Time: < 1 minute

నకిలీ డిగ్రీ మెమోతో పదోన్నతి..జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్.. జగిత్యాల జిల్లాలో ఘటన

Caption of Image.

కొత్తపల్లి, వెలుగు: నకిలీ డిగ్రీ మెమోతో పదోన్నతి పొందిన ఉద్యోగిని అరెస్ట్  చేసినట్లు కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్​ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పయ్యపల్లికి చెందిన నలిగేటి తిరుపతి(33) గతంలో వీఆర్ఏగా పని చేశాడు. 

తిరుపతి డిగ్రీ పూర్తి చేయకపోయినా ప్రమోషన్​ కోసం తన భార్య డిగ్రీ లాంగ్  మెమోలో పేరు, తండ్రి పేరు, రోల్  నంబర్  వంటి వివరాలను మార్చి నకిలీ డిగ్రీ మెమో తయారు చేశాడు. ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి విద్యార్హతల ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు చేపట్టిన సమయంలో తిరుపతి నకిలీ డిగ్రీ మెమోను సమర్పించి జూనియర్  అసిస్టెంట్  ఉద్యోగం పొందాడు. 

పెగడపల్లి తహసీల్దార్  ఆఫీస్​లో జూనియర్  అసిస్టెంట్​ అయిన తిరుపతి ప్రస్తుతం గొల్లపల్లి తహసీల్దార్  ఆఫీస్​కు అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై డ్యూటీ చేస్తున్నాడు. పక్కా సమాచారంతో తిరుపతి నకిలీ డిగ్రీ మెమో, దీని తయారీకి ఉపయోగించిన అతని భార్య డిగ్రీ మెమో జిరాక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిని రిమాండ్​కు పంపించనున్నట్లు సీఐ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.