
ప్రతి మానవుడు ఏదోఒక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.. అలా సమస్యలు ఎదుర్కోవడానికి కారణం ఏమిటి.. వాటిని ఎలా నివారించుకోవాలి.. జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారు.. అసలు బాధలు ఎందుకు వస్తాయి.. అవి పోవాలంటే ఏం చేయాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
జ్యోతిష్యపండితులు.. ఆధ్యాత్మిక వేత్తలు తెలిపిన వివరాల ప్రకారం గత జన్మల పాప పుణ్యాల ఆధారంగా ప్రస్తుత జన్మలో ప్రతి పాణికి కష్టాలు.. సుఖాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. పూర్వజన్మలో మనంచేసిన పాపం .. వ్యాధి రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టియే ఈ జన్మ ఆధారపడి ఉంటుంది. అందుకు అనుగుణంగానే మన జాతక చక్రం తయారవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపములోనో .. వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది.ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరుగదు. ప్రతి దానికీ ఓ కారణం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
మానవుడు అనుభవిస్తున్న బాధలకు, కర్మకు పూర్వ కర్మయే కారణమని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. . లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం… ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం .. సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది.
ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్ధంతమే హిందూ మతానికి పునాది కూడాకర్మ సిద్దాంతమే. జీవి జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసి ఉండే అవకాశం ఉంది. ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా ఉంటుంది. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా కర్మని చేసి అనుభవించాల్సి ఉంటుంది.
గతజన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు. కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడమూ ఉన్నదని స్పష్టమవుతోంది. గత జన్మలో ఓ వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికొదిలేసిన ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి.. పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నాడు.
గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు. ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలూ విషాద పరిస్థితుల్లో మరణించారు. వయసు అయిపోతోంది. చేతిలో డబ్బులేదు. ముసలి వయసులో ఫుట్ పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది.
గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిల పెళ్ళి సంబంధాలు చెడగొట్టేది. ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్ గా కనిపిస్తున్నది. ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళిసంబంధాలు వచ్చినా ఒక్కటీ కుదరటం లేదు. గట్టిరెమెడీలు చేస్తే గాని ఈ దోషం తొలగదు.ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వ జన్మ ప్రభావం ఎదుర్కొంటున్నారు కనిపిస్తారు. వీరందరూ సరియైన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు ఆగిపోతాయి. అయితే, సరియైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించాల్సి ఉంటుంది.
పూజలు చేస్తే గత జన్మ పాపాలు పోతాయా..!
పూర్వ జన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం పూర్వ జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని అనుకుంటారు. పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ వ్యాధి వస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.
అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి… దోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.