Reading Time: 3 minutes
Lung Cancer Risk From Kitchen Smoke In Women Explained

ఆమె ఊపిరికి ఈ సమాజం ఎప్పుడూ ధర కట్టలేదు. చేతి రుచికి మాత్రం వంద పేర్లు పెట్టింది. కొన్నిసార్లు కూర బాగుందంటారు.. కొన్నిసార్లు వంకలు పెట్టి తిడతారు. ఈ రెండింటి మధ్య ఆమె శరీరంలో ఎన్ని రుతువులు దహనమయ్యాయో మాత్రం ఎవరూ అడగరు. వడ్డించిన ప్రతి ముద్దను సమాజం ప్రేమతో కొలిచింది. ప్రతి త్యాగాన్ని సహజం అంటూ చప్పట్లు కొట్టింది.

అయితే మెడికల్‌ సైన్స్ మాత్రం ఆ చప్పట్ల మధ్య దాగిపోయిన ఒక నిజాన్ని బయటకు తీసింది. భారత్‌లో అత్యధికంగా ప్రాణాలను తీస్తున్న క్యాన్సర్.. ఊపిరితిత్తుల క్యాన్సర్. ఆ వ్యాధి బారిన పడుతున్న వారిలో జీవితంలో ఒక్కసారి కూడా సిగరెట్ ముట్టని వేలాది మంది మహిళలే ఉన్నారు. వంటగదిలో ప్రతిరోజూ లేచే పొగ, వారి ఊపిరితో కలిసి ఎంత దూరం ప్రయాణించిందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

ఇన్నాళ్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే సిగరెట్ తాగే వారికే వచ్చే వ్యాధిగా భావించాం. ఇప్పుడు ఆ అభిప్రాయం వేగంగా మారుతోంది. బెంగళూరులో ఓ 50ఏళ్ల మహిళకు కొన్ని వారాలుగా దగ్గు తగ్గలేదు. అప్పుడప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కూడా వచ్చింది. ఇది ఆస్తమా అనుకుని చికిత్స తీసుకుంది. పరిస్థితి మారకపోవడంతో మరోసారి వైద్యుడిని కలిసింది. చెస్ట్ ఎక్స్‌రే తీస్తే చేదు నిజం బయటపెట్టింది. ఊపిరితిత్తుల చుట్టూ ద్రవం చేరిపోయింది. మరిన్ని పరీక్షల తర్వాత ఆమెకు చివరి దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. అప్పటికే ఆ వ్యాధి ఊపిరితిత్తులను దాటి శరీరంలోని మరో పొరకు కూడా వ్యాపించింది.

వైద్యులు ఇప్పుడు ఎక్కువగా గమనిస్తున్న మార్పు ఇదే. సిగరెట్ తాగని మహిళల్లో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరుగుతోంది. గ్లోబోకాన్ అంచనాల ప్రకారం 2025లో భారత్‌లో లక్షా 12వేల 659 కొత్త ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అందులో 98,687 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో ఇది మొదటి స్థానానికి చేరుకుంది. మొత్తం క్యాన్సర్ కేసుల్లో ఇది మూడో స్థానంలో ఉన్నప్పటికీ మరణాల విషయంలో మాత్రం మిగిలినవాటిని దాటేసింది.

20ఏళ్ల క్రితం మహిళల్లో నమోదయ్యే ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు మొత్తం కేసుల్లో దాదాపు 20శాతం మాత్రమే. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 30శాతానికి చేరుకుంది. ఒక్క ఏడాదిలోనే 33,600 మందికిపైగా మహిళలకు ఈ వ్యాధి నిర్ధారణ అయింది.

అంతకంటే ఆశ్చర్యపరిచే విషయం ఇంకొకటి ఉంది. భారతీయ మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో 60శాతం నుంచి 85శాతం మంది జీవితంలో ఎప్పుడూ సిగరెట్ తాగలేదు. ఆసుపత్రుల్లో నమోదవుతున్న అధ్యయనాలు కూడా ఇదే చిత్రాన్ని చూపిస్తున్నాయి. మొత్తం రోగుల్లో 15శాతం నుంచి 35 శాతం మంది వరకు పొగతాగే అలవాటు లేనివారే. మరి వారి ఊపిరితిత్తులను గాయపరుస్తున్నది ఏంటి? ఒక్క కారణాన్ని చూపించడం వైద్యశాస్త్రానికి కూడా సాధ్యం కాలేదు.

బయట పెరుగుతున్న వాయు కాలుష్యం, ఇతరులు తాగే సిగరెట్ పొగ, కొన్ని ఉద్యోగాల్లో రసాయనాల ప్రభావం, రాడాన్ వాయువు, జన్యుపరమైన మార్పులు ఇవన్నీ కలిసి ప్రమాదాన్ని పెంచుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే వీటితో పాటు మరో అంశం కూడా ఇప్పుడు తీవ్రంగా పరిశోధనలో ఉంది. అదే వంటగదిలోని పొగ. నూనెను ఎక్కువ వేడిచేసి పొగ వచ్చే స్థాయికి తీసుకెళ్లినప్పుడు గాలిలో కంటికి కనిపించని అతి సూక్ష్మ ధూళి కణాలు వ్యాపిస్తాయి. వాటితో పాటు ఫార్మాల్డిహైడ్, అక్రోలిన్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు వంటి హానికర రసాయనాలు కూడా విడుదల అవుతాయి. ఇవి ఊపిరితిత్తులను దెబ్బతీయడమే కాకుండా కొన్ని పరిస్థితుల్లో క్యాన్సర్ ప్రమాదంతో సంబంధం ఉన్నాయని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి.

రెండు దశాబ్దాలుగా జరిగిన అధ్యయనాల్లో ఒక విషయం పదేపదే కనిపించింది. సరైన గాలి ప్రసరణ లేని వంటగదుల్లో ప్రతిరోజూ వంట చేసే వారిలో, ముఖ్యంగా వంట నూనె పొగకు ఎక్కువకాలం గురయ్యే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంది. వంటనూనె పొగకు దీర్ఘకాలం గురైన వారిలో ఈ ప్రమాదం దాదాపు 87 శాతం వరకు పెరిగినట్లు పరిశోధనలు గుర్తించాయి.

ముఖ్యంగా పొగతాగే అలవాటు లేని మహిళల్లో ఈ సంబంధం మరింత బలంగా కనిపించింది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. వంట చేయడం వల్లే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని ఏ పరిశోధన కూడా చెప్పడం లేదు. గాలి సరిగా బయటకు వెళ్లని వంటగదులు, పొగ వచ్చేంత వరకు నూనెను వేడి చేయడం, కట్టెలు, బొగ్గు వంటి ఘన ఇంధనాల వాడకం, సంవత్సరాల తరబడి అలాంటి పొగను పీల్చడం లాంటి పరిస్థితులు ప్రమాదాన్ని పెంచే అవకాశముందని మాత్రమే శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 210కోట్ల మంది కట్టెలు, బొగ్గు, బొగ్గు బూడిద, పంట వ్యర్థాలు లాంటి ఘన ఇంధనాలతోనే వంట చేస్తున్నారు. వాటి నుంచి వచ్చే పొగ శ్వాసకోశ వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతోంది. ఈ భారం ఎక్కువగా మహిళలపైనే పడుతోంది. ఎందుకంటే వంటగదిలో ఎక్కువసేపు గడిపేది ఇప్పటికీ వారే.

ఈ వ్యాధి మరో ప్రమాదకర లక్షణం కూడా కలిగి ఉంది. మొదట్లో అది సాధారణ దగ్గులా కనిపిస్తుంది. కొందరిలో ఆస్తమాలా ఉంటుంది. మరికొందరిలో అలెర్జీలా అనిపిస్తుంది. ఇంకొందరికి క్షయవ్యాధి అనుకుని చికిత్స మొదలవుతుంది. అసలు నిజం తెలిసే సమయానికి వ్యాధి చాలాసార్లు చాలా దూరం వెళ్లిపోయి ఉంటుంది. అందుకే తగ్గని దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక కుటుంబం కోసం వంట చేయడం బాధ్యతే కావచ్చు కానీ ఆ బాధ్యత ఆరోగ్యాన్ని కాల్చేసే పొగగా మారకూడదు. వంట చేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించడం, కిటికీలు తెరవడం, నూనెను పొగ వచ్చేంత వరకు వేడి చేయకపోవడం, ఆవిరితో ఉడికించడం లేదా మరిగించడం లాంటి పద్ధతులను ఎక్కువగా ఎంచుకోవాలి.

ఈ చిన్న మార్పులు ఊపిరికి పెద్ద రక్షణగా నిలవొచ్చు. కుటుంబానికి అన్నం పెట్టే చేతులను కాపాడుకోవడం అంటే ఒక్క మహిళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు.. ఒక కుటుంబం ఊపిరిని కాపాడుకోవడం కూడా.