Reading Time: < 1 minute

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 251 మంది బాలకార్మికులకు విముక్తి..

Caption of Image.

నల్గొండ, వెలుగు: నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నెల రోజుల పాటు నిర్వహించిన 12వ విడత ‘ఆపరేషన్ ముస్కాన్-’ ప్రత్యేక డ్రైవ్ లో 251 మంది చిన్నారులకు (239 మంది బాలురు, 12మంది బాలికలు) అధికారులు విముక్తి కల్పించారు. నల్గొండ జిల్లాలో 124 మంది, సూర్యాపేట జిల్లాలో 127 మందిని రక్షించగా, వీరిలో బిహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. 

రైస్ మిల్లులు, హోటళ్లు, బేకరీలు, వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఈ చిన్నారులను కాపాడామని, బాల కార్మికులను అక్రమంగా పనిలో పెట్టుకున్న నల్గొండలో 108, సూర్యాపేటలో 90 మంది యజమానులపై కేసులు నమోదు చేశామని ఆయా జిల్లాల ఎస్పీలు శరత్ చంద్ర పవార్, కె. నరసింహ వెల్లడించారు. 

ఎవరికైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే డయల్-100/112 లేదా చైల్డ్ హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్-1098కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్​ చేసిన పోలీస్, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులను ఎస్పీలు అభినందించారు.

వనపర్తిలో 82 మంది ..

వనపర్తి : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా జిల్లాలో జూలైలో నిర్వహించిన 12వ విడత ‘ఆపరేషన్ ముస్కాన్’ లో భాగంగా 82 మంది బాల కార్మికులను (78 మంది బాలురు, 4 మంది బాలికలు) రక్షించామని ఎస్పీ సునితారెడ్డి తెలిపారు.  వీరిని చట్టవిరుద్ధంగా పనిలో పెట్టుకున్న 26 మంది యజమానులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 

రక్షించిన బాలలను సంబంధిత శాఖల సమన్వయంతో పునరావాస కేంద్రాలకు తరలించి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి తిరిగి పాఠశాలల్లో చేర్పించే ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.
 

©️ VIL Media Pvt Ltd.