Reading Time: < 1 minute

స్వేచ్ఛ అంటే ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం కాదు: జాతీయ భద్రతా అడ్వైజర్ అజిత్ దోవల్

Caption of Image.

పుణె: స్వేచ్ఛ అంటే ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం కాదని, ఎవరికి తోచింది వారు చేయడానికి అది లైసెన్స్​కాదని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ యువతకు సూచించారు. స్వేచ్ఛతో పాటు సమాజం, దేశం పట్ల ఎంతో బాధ్యత ఉంటుందని ఆయన హితవు పలికారు. నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు, హింసాత్మక ఘటనలు, భద్రతా సిబ్బందిపై దాడులు జరిగి 200 మందికి పైగా గాయపడిన పరిణామాల మధ్య  దోవల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వర్ధంతిని పురస్కరించుకుని పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతకు ఆయన అందించిన సేవలకు ‘లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని’ ప్రదానం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అవార్డును అందుకున్న దోవల్.. యువత ప్రజాస్వామిక హక్కులతో పాటు జాతీయ భావాన్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. 

‘‘నేటి యువత స్వేచ్ఛ అంటే ఏది కోరుకుంటే అది చేసేయడమే అని పొరపడుతున్నారు. కానీ నిజమైన స్వేచ్ఛ అర్థం అది కాదు’’ అని అన్నారు. తిలక్ నాటి బ్రిటీష్ పాలనలో పడిన కష్టాలను నేటి తరాలు ఊహించలేనివని చెప్పారు. దేశాన్ని శక్తిమంతంగా, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే యువత ప్రథమ కర్తవ్యం కావాలని ఆకాంక్షించారు.  హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తీసుకునే ప్రతి జాతీయ భద్రతా నిర్ణయంలోనూ దోవల్ పాత్ర, సలహాలు ఉన్నాయన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.