
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. శనివారం గాంధీ భవన్‌లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ‘సర్’ సమావేశంలో హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి హోదాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు.
నియోజకవర్గంలో ‘సర్’ కార్యక్రమం మరింత వేగంగా జరగాలని, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ)తో కలిసి పని చేయాలని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ నెల 10లోపు ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో మంత్రి అజారుద్దీన్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.