Reading Time: < 1 minute
Bareilly Shahjahan Bano Prateeksha Pawan Wedding

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలోని అగస్త్య ముని ఆశ్రమంలో ఓ అరుదైన వివాహం జరిగింది. జాన్‌పూర్ ప్రాంతానికి చెందిన షాజహాన్ బానో అనే యువతి తన స్వచ్ఛంద నిర్ణయంతో సనాతన ధర్మాన్ని స్వీకరించి, తన పేరును ప్రతీక్షగా మార్చుకుంది. అనంతరం ఆమె ప్రతాప్‌గఢ్‌కు చెందిన తన ప్రియుడు పవన్‌తో కలిసి వేద మంత్రోచ్ఛారణల మధ్య ఏడడుగులు వేసి, జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసింది. ఈ వినూత్న వివాహానికి సంబంధించిన వార్త మరియు వీరి ప్రేమకథ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జాన్‌పూర్‌లోని భీలంపుర్‌కు చెందిన షాజహాన్ బానో, ప్రతాప్‌గఢ్‌లోని భోజేమౌ గ్రామానికి చెందిన పవన్‌లకు స్కూల్ రోజుల నుంచే పరిచయం ఉంది. ఒకే కళాశాలలో డిగ్రీ పూర్తి చేస్తున్న సమయంలో వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరువైపులా కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వివాహం కోసం బరేలీలోని అగస్త్య ముని ఆశ్రమాన్ని ఆశ్రయించారు.

ఆశ్రమ పూజారి కేకే శంఖధార్ వీరిద్దరి విద్యార్హత, వయస్సు ధృవీకరణ పత్రాలను సమగ్రంగా పరిశీలించి, వారు మేజర్లు అని నిర్ధారించుకున్నారు. ప్రతీక్ష కోరిక మేరకు సనాతన సాంప్రదాయం ప్రకారం సిందూర ధారణ, మంగళసూత్ర ధారణ, సప్తపది (ఏడడుగులు) క్రతువులను నిర్వహించారు. తమ ఆశ్రమంలో జరిగిన 251వ వివాహం ఇదని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. చట్టపరమైన ప్రక్రియలు, పత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత, కేవలం మేజర్లు అయి ఉండి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే జంటలకు మాత్రమే ఇక్కడ పెళ్లిళ్లు జరిపిస్తామని వారు స్పష్టం చేశారు. ఇక, ఈ పెళ్లిపై ఓ వర్గం నుంచి తీవ్రంగా వ్యతిరేకత మొదలైంది. యువతి ఇంట్లోనూ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.