
నంద్యాల జిల్లా ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో పెద్ద ఎత్తున అంతర్గత బదిలీలు చేపట్టడంతో ఉద్యోగుల్లో కలకలం రేగింది. ఏఈవో స్థాయి నుంచి సూపరింటెండెంట్, పర్యవేక్షకుల వరకు మొత్తం 23 మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి యువ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం, విధుల సమర్థ నిర్వహణ కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, మరిన్ని బదిలీలు కూడా ఉండే అవకాశముందన్న ప్రచారం ఉద్యోగుల్లో చర్చకు దారితీసింది.
శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అంతర్గత బదిలీల ప్రక్రియను ప్రారంభించారు. ఆలయ ఈవో యువ శ్రీనివాసరావు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఏఈవోలు, సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులు సహా మొత్తం 23 మంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఈ బదిలీల్లో భాగంగా కర్నూలు సమాచార కేంద్రంలో ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న ఫణిధర్ ప్రసాద్‌ను శ్రీశైలం దేవస్థానం పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. అలాగే ముగ్గురు ఏఈవోలకు అదనపు బాధ్యతలు కేటాయించారు. మరో ఇద్దరు ఏఈవోలను ప్రస్తుతం నిర్వహిస్తున్న విభాగాల్లోనే కొనసాగిస్తూ అదనపు విధులను అప్పగించారు. వీటితో పాటు 17 మంది పర్యవేక్షకులను కూడా వివిధ విభాగాలకు మార్చారు.
దేవస్థానంలో ప్రతి విభాగం పనితీరు మెరుగుపడేలా, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగేలా ఈ అంతర్గత బదిలీలు చేపట్టినట్లు ఈవో యువ శ్రీనివాసరావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన ఉద్యోగులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులను వెంటనే అప్పగించి, కొత్తగా కేటాయించిన విభాగాల్లో తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలం దేవస్థానం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో, భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు వివరిస్తున్నారు.
అయితే ఒకేసారి 23 మంది ఉద్యోగులకు బదిలీలు జరగడం దేవస్థాన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పరిపాలనా వ్యవస్థలో చేపడుతున్న మార్పులకు కొనసాగింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు, నేడు లేదా రాబోయే రోజుల్లో మరికొందరు ఉద్యోగులకు కూడా అంతర్గత బదిలీలు జరిగే అవకాశముందని దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి. దీంతో శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా ప్రక్షాళన ఇంకా కొనసాగనున్నట్లు స్పష్టమవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి