Reading Time: < 1 minute

హాస్టల్ చదువులు ఇష్టం లేక.. కస్తూర్బా నుంచి ముగ్గురు స్టూడెంట్లు పరార్

Caption of Image.
  • హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెదకొడెపాకలో ఘటన
  • అర్ధరాత్రి గోడ దూకి బయటకు వెళ్లిన బాలికలు
  • పక్కనే ఉన్న పొలాల్లో తల దాచుకున్న స్టూడెంట్లను గుర్తించిన పోలీసులు
  • పేరెంట్స్ కు అప్పగించిన సిబ్బంది

శాయంపేట, వెలుగు: హాస్టల్​ చదువులు ఇష్టం లేక హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట శివారులోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు పరారయ్యారు. స్టూడెంట్స్​ హాస్టల్​ పరిసర ప్రాంతంలోనే దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేజీబీవీలోని ముగ్గురు విద్యార్థినులు శుక్రవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో పండ్ల ట్రే బాక్సులపైకి ఎక్కి గోడ దూకి పారిపోయారు. 

తెల్లవారుజామున 4 గంటలకు నైట్ వాచ్  ఉమెన్  పర్వీద గమనించి, నైట్​ డ్యూటీలో ఉన్న మాథ్స్  టీచర్  శ్రావణికి తెలియజేశారు. ఆమె హాస్టల్​ స్పెషల్  ఆఫీసర్ మాధవికి సమాచారం అందించారు. ఎస్​వో వెంటనే పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన గురుకులం చేరుకున్న పోలీసులు, తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో గోవిందాపూర్​ వెళ్లే దారిలో చెట్ల పొదల్లో దాక్కొని ఉన్న ముగ్గురు స్టూడెంట్స్​ కనిపించారు.

 టీచర్, స్పెషల్  ఆఫీసర్  మాధవిపై పిల్లల పేరెంట్స్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్​లో పిల్లలకు భద్రత లేదని, టీచర్లు డ్యూటీలో ఉండగా ఎలా పారిపోయారని నిలదీశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్​ ఆర్.ప్రవీణ్ కుమార్  స్కూల్​కు చేరుకొని విచారణ చేపట్టారు. స్కూల్​లో ఉండడం ఇష్టం లేదని, ఆలస్యంగా లేస్తే గుంజీలు తీయిస్తున్నారని, గోడ కుర్చీ వేయిస్తున్నారని పిల్లలు స్టేట్​మెంట్  ఇచ్చారు.
 

©️ VIL Media Pvt Ltd.