
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కోరుకున్నానని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆషాఢమాస బోనాల సందర్భంగా ఆదివారం (ఆగస్ట్ 2) కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీపీ సజ్జనార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల కోసం 2500 మంది పోలీసుల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. అమ్మవారికి బోనాలు తీసుకువచ్చే మహిళల కోసం షీ టీమ్స్‌తో పాటు ప్రత్యేక విభాగాల పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులకు పిక్ పాకెటర్స్ బెడద లేకుండా ఏఐ జనరేటెడ్ కెమెరాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చిపోయే భక్తుల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.