Reading Time: 2 minutes

బీహార్ రాజకీయాల్లో అత్యంత వెనుకబడిన కులాలు పునాదిగా నితీశ్ కుమార్ ప్రభుత్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు వారసత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించిన నితీశ్‌కుమార్ తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను రాజకీయ ప్రవేశం చేయిస్తున్నారు. అయితే బిజెపి నాయకత్వంలోని జెడి(యు)లో చీలికలు వస్తాయా అన్న అనుమానం కలుగుతుంది. బిజెపి తన అధికారంలోనున్న రాష్ట్రాల్లో స్థానిక ప్రాంతీయ పార్టీలను చీల్చడం, బలహీనపరచడం తెలిసిందే. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిందీ భాషా రాష్ట్రాల్లో బిజెపికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2019 ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లోని 225 సీట్లలో 203 గెలుచుకుంది. కాని 2024 లో 55 సీట్లు కోల్పోయింది. ఫలితంగా బిజెపి లోక్‌సభలో 240 సీట్లతో మైనారిటీలో పడింది. కాని టిడిపి, జెడి(యు) ప్రధాన మద్దతుదారులుగా శివసేన, ఎన్‌పి మరికొన్ని చిన్న పార్టీల అండదండలతో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ఈ నేపథ్యంలో తూర్పు కారిడార్‌కు (యుపి, బీహార్, జార్ఖండ్ బెల్ట్) విస్తరించడానికి పటిష్టం కావడానికి బీహార్‌నే తన పాలనా కేంద్రంగా మార్చడానికి బిజెపి ఇప్పుడు పావులు కదుపుతోంది.

ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్ బీహార్ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకొని రాజ్యసభకు వెళ్లడం వల్ల బీహార్ కుల రాజకీయాల్లో మార్పు కనిపించవచ్చు. దీన్ని నివారించే ఉద్దేశంతో నితీశ్ వెనుకనున్న ఇబిసి, ఒబిసిలను తన వైపు రాబట్టుకోవడానికి బిజెపి వ్యూహాలు రూపొందిస్తోంది. నితీశ్ నిష్క్రమణతో బీహార్‌లో ఒక విధమైన రాజకీయాల శకం ముగిసింది. ఇక బిజెపి ఆధిపత్య రాజకీయ శకం ఆరంభం అవుతుంది. నితీశ్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) నేతగానే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పరిపాలించారు. గత కొన్ని దశాబ్దాలుగా సోషలిస్టుగా ముద్రపడిన రాజకీయాలకు ఇప్పుడు ముగింపు పలకడమే అవుతుంది. అంతేకాక కాషాయ రాజకీయాలు పూర్తి ఆధిపత్యంతో రాష్ట్రంలో ప్రవేశించడానికి సంకేతం పలుకుతుంది. ఎర్ర సమూహం నీడల నుంచి తను ఆవిర్భవించినప్పటికీ ఇప్పుడు ఆ నీడలు నీరసించిపోయాయి. 1970లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో సాగిన ఉద్యమంలో నితీశ్ ప్రముఖ నేతగా పుట్టకొచ్చారు. దేశ రాజకీయాల్లో పూర్తి విప్లవాత్మక మార్పులు తీసుకు రావడమే ఆ నాడు లక్షంగా నితీశ్ భావించారు. ఇందిరా గాంధీ నేతృత్వంలోని ఫాసిస్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్మూలించడమే ప్రధాన లక్షంగా పెట్టుకున్నారు.

ఇందిరా గాంధీని పదవి నుంచి తొలగించ గలిగినా తాను ఆశించిన ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను సాధించలేకపోయారు. అయితే ఈ సమయంలో యూనివర్శిటీ క్యాంపస్ నుంచి కొత్త యువ నేతలు రంగంలోకి దిగారు. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ ఈ గ్రూపు వారే. ఎమర్జెన్సీలో జరిగినఘోరమైన తప్పిదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా జాతీయ స్రవంతిలో ఒక పార్టీని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం జరిగింది.ఆ సమయంలో కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా జనతా పార్టీ ఏర్పాటయింది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజకీయ విభాగంగా ఉన్న జనసంఘ్‌కు కొంత సహాయపడింది. రాజకీయ అంటరానితనాన్ని నిర్మూలించింది. 1977 సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వంలో ఒక భాగమైంది. ఈలోగా హిందుత్వ దూకుడు రాజకీయాలతో బిజెపి రాజకీయ శక్తిగా అవతరించింది. అయితే బీహార్‌లో సోషలిస్టువాదులు ఆర్‌ఎస్‌ఎస్ హిందుత్వ జాతీయతను వ్యతిరేకించారు.

అయినా సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో 1990లో హిందుత్వ గ్రూపులకే సహాయం అందించారు. అదే తర్వాత బిజెపి నాయకుడు వాజ్‌పేయ్ ప్రధాని కావడానికి దోహదం చేసింది. ఇప్పుడు నితీశ్ కుమార్ తన ముఖ్యమంత్రి స్థానాన్ని ఖాళీ చేసి దేశ జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోడీ అండదండలు అందించడం చెప్పుకోదగిన మార్పు. ఇండియా కూటమి సమయంలో ప్రధాని అభ్యర్థిగా నితీశ్ తెరమీద కనిపించినప్పటికీ కాంగ్రెస్‌తో తలెత్తిన విభేదాల వల్ల ఎన్‌డిఎకే మద్దతు ఇచ్చారు. ఇది మోడీ మూడోసారి ప్రధాని కావడానికి దోహదం చేసింది. ఇక నితీశ్ కుమార్‌డు నిషాంత్‌ను బీహార్‌లో చోటు కల్పించడం ఎంత వరకు జెడి(యు) పార్టీని సమైక్యంగా ఉంచగలుగుతుందో ప్రశ్నార్థకం. కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో నితీశ్ ఏదైనా మంత్రి పదవిని సాధించగలరని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే బీహార్‌లోని కుల రాజకీయాలను ఒక దిశలో నడిపించగలరా అన్న అనుమానం కలుగుతుంది. నిషాంత్ రాజకీయాలకు కొత్త అయినందున రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వాన్ని ఆశించలేదని నితీశ్ వర్గం చెబుతోంది.

అయితే నితీశ్ రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజక వర్గం నుంచి నిషాంత్ ఎన్నిక కావచ్చు. మరి జెడి(యు)లో సీనియర్లు ఉండగా నిషాంత్‌కు పగ్గాలు అప్పగిస్తారా లేక కొన్నాళ్లు నిరీక్షించి ఆచితూచి వ్యవహరిస్తారా అన్నది ఇప్పుడు తేలాలి. బీహార్‌లో చిరాగ్ పాశ్వాన్ (ఎల్‌జిపి ఆర్‌విపి తదితరులతో కూడిన వర్గం ఇప్పుడు నిషాంత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంలోకి ఆధిపత్యం వహించేలా ప్రయత్నాలు జరిగితే జెడి(యు)లో చీలికలకు దారి తీస్తుందని భావిస్తున్నారు. అయితే కేంద్రంలోని బిజెపి మాత్రం బీహార్ కుల రాజకీయాల నుంచి విముక్తి కలిగించాలన్న లక్షంతో ఇప్పుడు ఈ వ్యూహాలు రూపొందిస్తోంది. అయితే రాజ్యసభకు తాను వెళ్లినా రాష్ట్రంలో తన మద్దతుదారులకు ఎటువంటి నష్టం ఉండదని నితీశ్ కుమార్ హామీ ఇస్తున్నారు.